Phone addiction:డిజిటల్ డిటాక్స్ అవసరమా? ఫోన్ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి?

Phone addiction:మనకు వచ్చే ప్రతి కొత్త నోటిఫికేషన్, మెసేజ్, లేదా సోషల్ మీడియాలో వచ్చే ఒక 'లైక్' ఒక చిన్నపాటి "రివార్డ్" లాగా పనిచేస్తుంది.

Phone addiction

ఈ తరం చేతిలో స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక పరికరం కాదు, అది ఒక అంతులేని లోకాన్ని మన అరచేతిలో ఇరికించిన ఒక డిజిటల్ తోడు. ఉదయం లేవగానే ఈ ప్రపంచంలో మనకు మొదటి దర్శనమిచ్చేది ఫోన్ తెర, రాత్రి కళ్లు మూసే ముందు చివరి స్పర్శ కూడా దానిదే. ఈ నిరంతర బంధం, ఒక మత్తులా మనల్ని ఆవహిస్తుంది, దానిని మనం డిజిటల్ వ్యసనం లేదా మానసిక బంధనం అని పిలుస్తున్నారు సైకాలజిస్టులు. ఎందుకంటే ఇది తెలియకుండానే మన స్వేచ్ఛను హరించే ఒక సున్నితమైన సంకెళ్లు అని చెబుతున్నారు.

ఈ వ్యసనం (phone addiction)వెనుక ఉన్నది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, మన మెదడును శాసించే ఒక మానసిక మాయాజాలం. మన మెదడులోని డోపమైన్ వ్యవస్థ ఈ వ్యసనానికి మూల కారణం. మనకు వచ్చే ప్రతి కొత్త నోటిఫికేషన్, మెసేజ్, లేదా సోషల్ మీడియాలో వచ్చే ఒక ‘లైక్’ ఒక చిన్నపాటి “రివార్డ్” లాగా పనిచేస్తుంది. ఈ చిన్న చిన్న ఆనందపు అనుభూతుల కోసం మన మెదడు మళ్లీ మళ్లీ ఫోన్‌ను తడుముతూ ఉంటుంది, అది ఒక డోపమైన్ గొలుసుకట్టులా మనల్ని కట్టిపడేస్తుంది. ప్రతి గంటకు, ప్రతి నిమిషానికి ఒక తెలియని ప్రేరణ మనల్ని ఫోన్ వైపు లాగుతూనే ఉంటుంది.

Phone addiction

ఈ వ్యసనం (phone addiction)మన మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్’ (FOMO) – అంటే “ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతానేమో” అనే భయం, మనల్ని నిరంతర ఆందోళనలో ఉంచుతుంది. ఇక, ఫోన్ దగ్గర లేనప్పుడు కలిగే అసహనం, నిరంతర అశాంతి నోమోఫోబియా (Nomophobia) అనే మానసిక సమస్యకు దారితీస్తుంది. సోషల్ మీడియాలో ఇతరుల పరిపూర్ణమైన జీవితాలను చూసి, మన జీవితాన్ని పోల్చుకోవడం వల్ల మన ఆత్మవిశ్వాసానికి గొడ్డలిపెట్టు పడుతుంది. ఈ ఒత్తిడులన్నీ కలగలిసి డిప్రెషన్, నిద్రలేని రాత్రులు, నిరంతర అశాంతికి కారణమవుతాయి.

ఈ డిజిటల్ బంధం మన వ్యక్తిగత సంబంధాలపై తీవ్రమైన పగుళ్లను సృష్టిస్తోంది. భౌతికంగా ఒకే గదిలో ఉన్నా, ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో వేర్వేరు ప్రపంచాల్లో మునిగిపోవడం వల్ల నిజమైన బంధానికి కత్తెర పడుతోంది. సైకాలజిస్టులు దీనిని “ఫాంటమ్ కనెక్టివిటీ” అంటే, భౌతికంగా కలిసి ఉన్నా మానసికంగా వేర్వేరు ప్రపంచాల్లో ఉండటం అని వర్ణిస్తారు. ఫోన్‌తో వచ్చే ఈ అవాస్తవిక బంధం, కుటుంబంతో, స్నేహితులతో గడపాల్సిన అమూల్యమైన సమయాన్ని హరించివేస్తోంది.

ఈ వ్యసనాన్ని అధిగమించడం అసాధ్యం కాదు. మొదటగా, మన ఫోన్ వాడకాన్ని(phone addiction) మనం నిరంతరం గమనించుకోవాలి. అనవసరమైన యాప్‌ల నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం, రోజుకు ఒక నిర్దిష్ట సమయాన్ని “డిజిటల్ డిటాక్స్” కోసం కేటాయించడం, వారంలో కనీసం ఒక రోజున ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టడం వంటివి చేయాలి. వాటికి బదులుగా పుస్తకాలు చదవడం, వాకింగ్ వెళ్లడం, సంగీతం వినడం, లేదా నిజమైన వ్యక్తులతో మాట్లాడటం వంటి పనులు చేయాలి. గుర్తుంచుకోండి, మన జీవితాన్ని సులభతరం చేయడానికి వచ్చిన ఫోన్, మన మానసిక స్వేచ్ఛను తినేయడానికి కాదు. ఫోన్ మన నియంత్రణలో ఉండాలి, మనం ఫోన్ నియంత్రణలో ఉండకూడదు.

Happiness:సంతోషం కోసం ఎంత వెతికితే అంత పారిపోతుంది..ఎందుకో తెలుసా?

Exit mobile version