Anxiety
జీవితంలో ఒత్తిడి, టెన్షన్ సర్వసాధారణం. కానీ, ఆ ఒత్తిడే మనసులో ఒక నిశ్శబ్ద అలజడిగా మారి, భయాన్ని, ఆందోళనను నిరంతరం వెంటాడితే.. అది సాధారణ టెన్షన్ కాదు. అది ‘ఆందోళన’ (Anxiety) అని గుర్తించాలి. ఇతరులకు కనిపించని ఈ అంతర్గత తుఫాను, మనసునూ, శరీరాన్నీ నిరంతరం అల్లకల్లోలం చేస్తుంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని, సరిగ్గా గుర్తించగలిగితే, దాని నుంచి బయటపడటం ఈజీ అవుతుంది.
సాధారణంగా, ఒక ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు మన మెదడులోని అమిగ్డలా అనే భాగం చురుకుగా పనిచేసి, మన శరీరాన్ని “పోరాడు లేదా పారిపో” (Fight or Flight) అనే స్థితికి సిద్ధం చేస్తుంది. కానీ, యాంగ్జయిటీ ఉన్నవారిలో ఈ మెదడు భాగం అవసరం లేనప్పుడు కూడా అతి చురుకుగా ఉంటుంది. దీని వల్ల చిన్న విషయానికే గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, ఊపిరి బిగబట్టినట్లు అనిపించడం వంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి.
Also Read: Diabetes: డయాబెటిస్‌కు దంత సమస్యలు తోడవ్వాల్సిందేనా? ముందే చెక్ పెట్టలేమా?
యాంగ్జయిటీ ఉన్నవారిలో ఏదో జరగబోతుందన్న నిరంతర భయం, గుండె బరువుగా లేదా వేగంగా కొట్టుకోవడం,నిద్రలేమి లేదా అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ రావడం, కడుపులో ఆమ్లత్వం, వాంతులు వంటి జీర్ణ సంబంధ సమస్యలు, ఏ పనిలోనూ శ్రద్ధ పెట్టలేకపోవడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తుంటాయి.
యాంగ్జయిటీ కేవలం మానసికమైనదే కాదు, దీని వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా ఆందోళన లేదా డిప్రెషన్ ఉంటే, అది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. మెదడులోని సెరోటోనిన్, డోపమైన్ వంటి రసాయనాల స్థాయిలు తగ్గితే, మెదడు సరిగా రిలాక్స్ అవ్వదు. అలాగే, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ అధికంగా విడుదలైతే, శరీరం ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటుంది.
మీలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు అది సాధారణ టెన్షనో, ఆందోళనో ఈజీగా గుర్తించవచ్చు. మీ ఆందోళన ఆరు నెలల కంటే ఎక్కువ కొనసాగితే..రోజువారీ జీవితంపై, పనులపై తీవ్ర ప్రభావం చూపిస్తే..చిన్నపాటి సమస్యలకు కూడా అతిగా స్పందిస్తున్నారని మీకు అనిపిస్తే.. అది కేవలం టెన్షన్ కాదు, ఒక హెచ్చరిక అని అర్థం చేసుకోవాలి.
యాంగ్జయిటీ (Anxiety)అనేది చికిత్స చేయలేని సమస్య కాదు. సరైన మార్గంలో వెళ్తే దానిని పూర్తిగా నియంత్రించవచ్చు. దీనికోసం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT).. ఇది మన ఆలోచనా సరళిని మార్చే ఒక సైకోథెరపీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రతికూల ఆలోచనలను గుర్తించి, వాటిని సానుకూలమైన వాటిగా మార్చడం ద్వారా ఇది పనిచేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కేవలం 30 నిమిషాల వేగవంతమైన నడక లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై మనసు ప్రశాంతంగా మారుతుంది. అలాగే 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ (4 సెకన్లు శ్వాస పీల్చడం, 7 సెకన్లు పట్టుకోవడం, 8 సెకన్లు వదలడం) నాడీ వ్యవస్థను నేరుగా శాంతపరుస్తుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (చేపలు, అవిసె గింజలు, చియా గింజలు), అరటిపండ్లు వంటివి మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచి, ఆందోళనను తగ్గిస్తాయి.