CyberCandria :చిన్న తలనొప్పి వచ్చినా ..అకస్మాత్తుగా దగ్గు స్టార్టయినా … వెంటనే మీ చేతులు ఫోన్ తీసి గూగుల్‌లో ఆ లక్షణాలను వెతకడం మొదలుపెట్టాయా? నిమిషాల వ్యవధిలోనే మీకు ఏదో పెద్ద జబ్బు వచ్చిందని మీ మనసు కంగారుపడటం మొదలుపెట్టిందా? అయితే, ఇది మీ ఒక్కరి కథ కాదు. లక్షలాది మందిలో ఇప్పుడు కనిపిస్తున్న ఒక కొత్త ఆరోగ్య సమస్య అంటున్నారు డాక్టర్లు. దాని పేరు ‘సైబర్ కాండ్రియా’ అని చెబుతున్నారు.
CyberCandria
మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రిపూట నిద్రపట్టకపోయినా, పగటిపూట కాస్త ఖాళీ సమయం దొరికినా, మీ వేళ్లు ఆటోమేటిక్‌గా మొబైల్‌పై, హెల్త్ వెబ్‌సైట్‌లపైనే వెతుకుతుంటాయి. మీరు కానీ, మీకు కావాల్సినవారు కానీ ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే,వాటి గురించి వెంటనే ఆ లక్షణాలను మీరు ఆన్‌లైన్‌లో వెతుకుతారు.
కొందరైతే రోజుకు ఏకంగా ఒకటి నుంచి మూడు గంటల వరకు ఇదే పనిలో మునిగిపోతారు. ఇది కేవలం ఒక అలవాటు కాదు. నిపుణులు దీన్ని ‘సైబర్ కాండ్రియా'(CyberCandria) అనే మానసిక సమస్యకు స్పష్టమైన లక్షణంగా చూస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఈ డిజిటల్ హెల్త్ క్యూరియాసిటీ పీక్స్ కి చేరుకుంది. దురదృష్టవశాత్తు, ఇదే అలవాటు మెల్లమెల్లగా తీవ్ర ఆందోళన, నిరాశ, డిప్రెషన్‌కు కారణమవుతుందని మానసిక వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మీరు ఇంటర్నెట్(Internet)లో సెర్చ్ చేసిన ప్రతిసారీ, ఇంటర్నెట్‌లో దొరికే ఆరోగ్య సమాచారం అంతా నమ్మదగినది కాదని మీకు తెలుసు. కానీ, ఆందోళనలో ఉన్నప్పుడు ఆ వివేకం పనిచేయదు. ఉదాహరణకు, మీరు సాధారణ తలనొప్పికి కారణం ఏమిటని వెతికితే, అది ఏకంగా మెదడులో క్యాన్సర్ లేదా మరేదో ప్రాణాంతక వ్యాధి లక్షణమని చూపించే వెబ్‌సైట్లు అడుగడుగునా కనిపిస్తాయి.
అలాంటి తప్పుడు, భయాన్ని పెంచే సమాచారం చూసి మీలో లేనిపోని టెన్షన్స్ పుట్టుకొస్తాయి. మీకు లేని జబ్బులను మీరే ఊహించుకుని, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి వంటి సమస్యలతో సతమతమవుతారు. ఈ డిజిటల్ మాయ మీ మానసిక ఆరోగ్యం( Digital Mental Health)పై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఇది కేవలం ఊహే అయినా, మీ నిజ జీవితాన్ని తీవ్ర ఆందోళనతో నింపేస్తుంది.
పైన చెప్పిన లక్షణాలు మీలో కానీ, మీ సన్నిహితుల్లో కానీ కనిపిస్తున్నట్లయితే తక్షణమే అలెర్ట్ అవ్వాలి. ఆరోగ్య విషయంలో ఏ చిన్న అనుమానం వచ్చినా, ఇంటర్నెట్‌లో గంటల కొద్దీ వెతకకుండా వెంటనే స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి. మీ లక్షణాలను వివరించి, సరైన సలహా, చికిత్స పొందడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం విషయంలో డాక్టరే అసలైన నిపుణుడు, ఇంటర్నెట్ కాదు అని గుర్తుంచుకోండి. డిజిటల్ ప్రపంచంలో మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని మరిచిపోకండి.