Eyes:కంటి చివర్లో ఎరుపు – నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమా?

Eyes :కంటి చివర్లో ఎరుపు అనేది శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులకు లేదా ఇన్ఫెక్షన్లకు సంకేతం కావొచ్చు .

Eyes

మన శరీరంలో అత్యంత సున్నితమైన అవయవాలు కళ్లు(Eyes) అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు కళ్లు మొత్తం ఎర్రబడకుండా కంటి చివర్లలో ఎరుపు కనిపిస్తుంది. దీనిని చాలా మంది నిద్రలేమి లేదా కళ్లపై ఒత్తిడి అని అనుకుంటారు. కానీ కంటి చివర్లో ఎరుపు అనేది శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులకు లేదా ఇన్ఫెక్షన్లకు సంకేతం కావొచ్చు అంటున్నారు నిపుణులు.

కంటి చివర్లో ఎరుపు రావడానికి ప్రధాన కారణం డ్రై ఐస్ (Dry Eyes). కంటిలో తగినంత తేమ లేనప్పుడు కానీ కన్నీటి గ్రంధులు సరిగ్గా పనిచేయనప్పుడు కానీ కళ్లు పొడిబారి చివర్లలో ఎర్రగా మారుతాయి. ముఖ్యంగా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడిపే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కంటి అలర్జీల వల్ల కూడా ఇలా జరగొచ్చు. గాలిలోని దుమ్ము, ధూళి , పెంపుడు జంతువుల వెంట్రుకల వల్ల కలిగే అలర్జీ కంటి లోపలి పొరను ప్రభావితం చేసి ఎరుపును కలిగిస్తుంది. దీంతో పాటు దురద, నీరు కారడం వంటి లక్షణాలు కూడా ఉంటే అది అలర్జీ కింద లెక్క.

మరో ముఖ్యమైన రీజన్ కంటి ఇన్ఫెక్షన్లు. కంటి రెప్పల చివర ఉండే గ్రంధులు ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు లేదా కనురెప్పల వాపు (Blepharitis) ఉన్నప్పుడు కంటి కోణాలలో ఎరుపు కనిపిస్తుంది. ఇది ఒక్కోసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కావొచ్చు. అలాగే కంటిలోని రక్తనాళాలు చిట్లడం వల్ల కూడా ఎరుపు మచ్చలు ఏర్పడొచ్చు. దీనిని సబ్‌కంజంక్టివల్ హెమరేజ్ అంటారు. ఇది సాధారణంగా నొప్పిని కలిగించదు కానీ చూడటానికి మాత్రం భయంకరంగా ఉంటుంది. తీవ్రమైన దగ్గు, తుమ్ము లేదా రక్తపోటు పెరగడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది.

అలాగే లైఫ్ స్టైల్‌లో లోపాలు కూడా కళ్ల ఎరుపునకు కారణమవుతాయి. సరైన నిద్ర లేకపోవడం, శరీరంలో నీటి శాతం తగ్గడం (Dehydration), విటమిన్ల లోపం వల్ల కూడా కళ్లు నిర్జీవంగా మారి ఎర్రబడతాయి. కొన్నిసార్లు మనం వాడుతున్న కాస్మెటిక్స్ లేదా కంటి చుట్టూ వాడే క్రీముల వల్ల కూడా అలర్జీ రావొచ్చు. అందుకే కంటి చివర్లో ఎరుపు కనిపించినప్పుడు అది కేవలం ఎరుపు మాత్రమేనా లేదా నొప్పి కూడా వస్తుందా అని అని గమనించాలి.

Eyes

పరిష్కార మార్గాల విషయానికి వస్తే, మొదటిగా కళ్ల (Eyes) పై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి . కంప్యూటర్ వాడే వారు ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కళ్లకు విశ్రాంతినివ్వాలి. చల్లని నీటితో కళ్లను అప్పుడప్పుడు కడుక్కోవడం వల్ల రిలీఫ్ లభిస్తుంది. కళ్లు పొడిబారకుండా ఉండటానికి డాక్టర్ల సలహాతో లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడొచ్చు. అలాగే రాత్రిపూట కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.

ఆహారంలో విటమిన్ ఏ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎరుపుతో పాటు చూపు మందగించడం, విపరీతమైన నొప్పి లేదా కంటి నుంచి చీము వంటివి వస్తుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. కళ్లు మనకు ప్రపంచాన్ని చూపిస్తాయి, అందుకే వాటి విషయంలో చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకూడదని తెలుసుకోవాలి.

IND vs NZ 3rd T20 : హ్యాట్రిక్ కొట్టాలి సిరీస్ పట్టాలి.. కివీస్ తో మూడో టీ20

Exit mobile version