Diabetes
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే, అది కేవలం కళ్లు, గుండెనే కాదు, మీ చిరునవ్వును కూడా మాయం చేస్తుంది. నోటిలోని ప్రతి చిన్న కణం చక్కెరతో నిండిపోయి, బ్యాక్టీరియాకు ఇల్లు కడుతుంది. ఈ బ్యాక్టీరియా మెల్లమెల్లగా మీ పళ్లను, చిగుళ్లను బలహీనపరుస్తుంది. ఒక్కో పన్ను వదులవుతూ వస్తుంది, చివరికి మీ దంతాలు ఊడిపోయే పరిస్థితి వస్తుందంటున్నారు డాక్టర్లు.
డయాబెటిస్(diabetes)ఉన్నవారిలో చిగుళ్ల సమస్యలు, పళ్లు పుచ్చిపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు, వారికి ఏ గాయం అయినా, అది తగ్గడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల కొత్త ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.మధుమేహం ఉన్నవారికి చిగుళ్ల సమస్యలు (పెరియోడాంటల్ డిసీజ్) ఎక్కువగా వస్తాయి. ఈ సమస్య పళ్ల చుట్టూ ఉండే ఎముకలను కూడా బలహీనపరుస్తుంది. క్రమంగా, నోటిలో పాచి పేరుకుపోయి, చిగుళ్ల నుంచి రక్తం కారడం, నొప్పి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే పళ్లు వదులైపోయి, నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది.
అంతేకాకుండా, మధుమేహం (diabetes) ఉన్నవారి లాలాజలంలో కూడా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది నోరు తరచూ పొడిబారడానికి కారణమవుతుంది. లాలాజలంలోని చక్కెర, బ్యాక్టీరియాతో కలిసినప్పుడు యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది పళ్లపై ఉండే ఎనామిల్ పొరను బలహీనపరుస్తుంది, దానివల్ల పళ్లు సులభంగా పుచ్చిపోతాయి.
మధుమేహ రోగులలో ఎక్కువగా కనిపించే మరో సమస్య క్యాండిడయాసిస్. నోటిలో ఈస్ట్ (శిలీంధ్రం) ఎక్కువగా పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. లాలాజలంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటంతో ఈస్ట్ త్వరగా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల నోటి లోపల ఎరుపు రంగులోకి మారడం, అల్సర్లు రావడం, నోరు పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకుంటే ఈ సమస్యలన్నీ వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి.
మధుమేహం ఉన్నవారు ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలి. పళ్ల మధ్యలో ఉన్న పాచిని ఫ్లాస్ సాయంతో శుభ్రం చేసుకోవాలి.
నోరు పొడిబారకుండా ఉండటానికి ఎక్కువగా నీళ్లు తాగాలి, చూయింగ్ గమ్ నమలడం మంచిది. సిగరెట్లు తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి.
దంతాల సమస్యల కోసం డెంటిస్ట్‌ను తరచుగా సంప్రదిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మధుమేహం ఉన్నవారు కూడా తమ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి