Social Media
ఈరోజు మనం ఏం ఆలోచించాలి, ఏం నమ్మాలి, ఎవర్ని ఇష్టపడాలి, ఎవర్ని ద్వేషించాలి.. ఇవి నిజంగా మనమే నిర్ణయించుకుంటున్నామా? లేదా మన ఫోన్ స్క్రీన్ లో కనిపిస్తున్న కంటెంట్ మన ఆలోచనలను నడిపిస్తోందా? సోషల్ మీడియా (Social Media)అంటే ఇక కేవలం టైమ్ పాస్ కాదు . అది ఒక మైండ్ కంట్రోల్ మెషిన్ అని చాలామందికి తెలీదు.
మనకు ఎలా నచ్చుతుందో అలా చూపిస్తుందా? లేదా మనం ఎలా మారాలనుకుంటుందో అలా మార్చుతుందా? ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. సోషల్ మీడియా మనల్ని ఎలా చదువుతుంది? నువ్వు ఏ వీడియో వద్ద ఆగావో, ఏ పోస్టుకు లైక్ కొట్టావో, ఏ విషయం మీద కోపం చూపించావో.. ఇవి అన్నీ అది గమనిస్తుంది.
మనకు తెలియకుండానే మన మనసు మ్యాప్ తయారు చేస్తుంది. ఈ వ్యక్తికి కోపం వచ్చే కంటెంట్ చూపించాలి, ఈ వ్యక్తికి భయం చూపిస్తే ఎక్కువ టైమ్ ఉంటాడు, ఈ వ్యక్తికి గొడవలు నచ్చుతాయి.. ఇలా మన మెదడును చదివి మళ్లీ అదే టైపు కంటెంట్ చూపిస్తుంది. అప్పుడే మన ఆలోచనలు ఒకే దిశలో తిరగడం మొదలవుతుంది. ఇదే ఎకో ఛాంబర్ (Echo Chamber).
మనకు నచ్చిన మాటలే వినిపిస్తాయి. మన నమ్మకానికే బలం చేకూరుతుంది. వేరే అభిప్రాయం కనిపించదు. కనిపించినా మనకు కోపం వస్తుంది. అప్పుడే మన ఆలోచనలు మనవిగా ఉండవు. అవి సోషల్ మీడియా(Social Media) ఇచ్చినవి అవుతాయి.
ఇంకో ప్రమాదం ఏమిటంటే.. భయం, కోపం, షాక్ ఇవే ఎక్కువగా వైరల్ అవుతాయి. శాంతి వైరల్ కాదు. నిజం వైరల్ కాదు. ఎందుకంటే కోపం మనల్ని ఎక్కువసేపు స్క్రీన్ కి అంటిస్తుంది. అందుకే నెగటివ్ న్యూస్ ఎక్కువగా కనిపిస్తుంది. అనవసర గొడవలు ఎక్కువగా కనిపిస్తాయి. దాంతో మన మనసు ఎప్పుడూ అలర్ట్ మోడ్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరిపై అనుమానం. ప్రతి విషయంపై ఆగ్రహం. ఇది మన సహజ స్వభావం కాదు .
ఇది ట్రెయిన్ చేయబడిన మనసు. ఇంకా చెప్పాలంటే— సోషల్ మీడియా (Social Media)మన పోలికల్ని పెంచుతుంది. వాళ్ల జీవితమే బాగుంది, నాకే ఇలా ఎందుకు?, నేను వెనకబడిపోయానా? ఇలాంటి ఆలోచనలు మెల్లగా మనలోకి ఎక్కుతాయి. మనకు ఉన్నదాన్ని మర్చిపోయి లేనిదానిపై మనసు పరుగెడుతుంది. ఇక్కడే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. సంతృప్తి చచ్చిపోతుంది.
అయితే తప్పు ఎవరిది? సోషల్ మీడియా చెడ్డది కాదు . అది ఒక అద్దం లాంటిది. మన మనసు ఎలా ఉందో అదే మళ్లీ మనకు చూపిస్తుంది. కానీ ఆ అద్దంలో చూస్తూ మనమే మారిపోతే ప్రమాదం. అందుకే ఒక పని చేయాలి. ప్రతి కంటెంట్ నిజమా అని ప్రశ్నించాలి. ప్రతి భావోద్వేగం మనదేనా అని ఆలోచించాలి. కొంతసేపు స్క్రీన్ నుంచి బయటకి రావాలి. మన ఆలోచనలను అల్గోరిథమ్ చేతుల్లో పెట్టకూడదు. ఫోన్ మన చేతిలో ఉండాలి. మన మెదడు ఫోన్ చేతిలో కాదు. లేకపోతే మన అభిప్రాయాలు మనవిగా ఉండవు. మన ఆలోచనలు మనవిగా ఉండవు. అవి స్క్రోల్ చేస్తూ వచ్చినవి అవుతాయి.
