Municipal Elections: తెలంగాణ మున్సిపల్ పోరు.. చిత్రమైన పొత్తులు- ముదురుతున్న పాత కొత్త వార్‌లు

Municipal Elections: స్థానిక పరిస్థితులకు తగినట్లుగా అధిష్టానాలు పచ్చజెండా ఊపడంతో, నాయకులు తమ వ్యక్తిగత అహాలను కూడా పక్కన పెట్టి వింత కూటములను ఏర్పాటు చేస్తున్నారు.

Municipal Elections

రాజకీయాల్లో ఎప్పుడూ కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) సమయంలో తెలంగాణలో అక్షరాలా నిజమవుతోంది. పార్టీల ఎజెండాలు ఏవైనా సరే, నాయకుల అంతిమ లక్ష్యం మాత్రం గెలుపు గుర్రం ఎక్కడమే . దీని కోసం ఏనాడూ కలవని పార్టీలు కూడా తాజాగా చేతులు కలుపుతున్నాయి. స్థానిక పరిస్థితులకు తగినట్లుగా అధిష్టానాలు పచ్చజెండా ఊపడంతో, నాయకులు తమ వ్యక్తిగత అహాలను కూడా పక్కన పెట్టి వింత కూటములను ఏర్పాటు చేస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకసారి చూస్తే అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. భువనగిరి, యాదగిరిగుట్ట వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ వామపక్షాలయిన సీపీఐ, సీపీఎంతో జతకట్టింది. మరోవైపు హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ సీపీఎం, సీపీఐలతో కలిసి వెళ్తుంటే, కోదాడలో సీపీఐ ఏకంగా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది.

ఖమ్మం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మధిర, సత్తుపల్లి వంటి చోట్ల సీపీఎం బీఆర్ఎస్ వైపు ఉంటే, అశ్వారావుపేటలో బీఆర్ఎస్, టీడీపీ ఒక్కటయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి మరో కూటమిగా ఏర్పడ్డాయి. ఇల్లెందులో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం,న్యూడెమోక్రసీ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడే చర్చలు చివరి దశకు చేరాయి. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో కూడా స్థానిక అవసరాల కోసం బీఆర్ఎస్ , వామపక్షాలు అక్కడక్కడ జతకట్టాయి.

మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు చిచ్చు రేపుతోంది. జగిత్యాల, గద్వాల నియోజకవర్గాల్లో పాత నేతలకు, కొత్తగా పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలకు మధ్య యుద్ధం పీక్స్‌కు చేరింది. ఇక్కడ అధిష్టానం నియోజకవర్గ ఇంచార్జ్‌ల మాటను పక్కన పెట్టి, జంపింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతమివ్వడమే వివాదాస్పదంగా మారింది.

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అధిష్టానం షాకిచ్చింది. 50 వార్డుల్లో మెజారిటీ స్థానాలు తన అనుచరులకు ఇవ్వాలని ఆయన పట్టుబట్టినా కూడా, పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కే 30 సీట్లు కేటాయించారు. దీంతో అసంతృప్తికి గురైన జీవన్ రెడ్డి, తిరుగుబాటు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలోకి దిగారు. అయితే ఈప్రచారంలో కాంగ్రెస్ గుర్తును వలసదారులు దొంగిలించారని, హస్తం గుర్తుతో సంబంధం లేకుండా పని చేసే వారికే ఓటు వేయాలని ఆయన ఓటర్లకు పిలుపును ఇవ్వడం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.

Municipal Elections

ఇక గద్వాలలో అయితే సరితా తిరుపతయ్య పరిస్థితి మరీ దారుణంగా మారింది. 37 డివిజన్లలో మొదట ఆమెకు 17 సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ, చివరికి 7 స్థానాలకే పరిమితం చేసింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఆ 7 సీట్ల బీఫామ్‌లను కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తన అకౌంట్లో వేసుకోవడంతో సరిత వర్గానికి ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో..ఆమె రివేంజ్ పాలిటిక్స్‌కు తెరలేపారు. తన అభ్యర్థులను స్వతంత్రులుగా బరిలోకి దింపి, కాంగ్రెస్ తీరును ఓ రకంగా ఎండగడుతున్నారు.

మరోవైపు ( Municipal Elections)సమయం తక్కువగా ఉండటంతో కేండిడేట్లు అంతా తమ ప్రచారాన్ని డిజిటల్ బాట పట్టించారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులను ప్రధాన వేదికగా చేసుకుని.. తాము ఓటర్ల సేవకుడిని అంటూ మెసేజులు పంపిస్తున్నారు. పార్టీ టికెట్ దక్కని వారు కూడా స్వతంత్రులుగా బరిలోకి దిగి, సోషల్ మీడియాలో తమ సత్తాను చాటుతున్నారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న ఈ పొత్తులు, పోరాటాలు చివరికి ఎవరిని మేయర్ పీఠంపై కూర్చోబెడతాయో అన్నది వేచి చూడాలి.

Pets :కుక్కలకు, పిల్లలకు బేకరీలు,సెలూన్లు..పెట్ కేర్ బిజినెస్‌ ఇన్ని కోట్లు కురిపిస్తుందా?

Exit mobile version