Sakinalu
ఆంధ్రాలో అరిసెలు ఎంత ఫేమస్సో, తెలంగాణలో సకినాలు(Sakinalu) అంత ఫేమస్ అన్న విషయం తెలిసిందే. సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలంగాణ పల్లెల్లో ఎటు చూసినా సకినాలే కనిపిస్తాయి. అంతెందుకు సకినాలు లేని తెలంగాణ ఇంటిని చూడటమే ఉండదు. దీనిని కేవలం ఒక వంటకంగా కాకుండా, ఆ ప్రాంత సంస్కృతిలో భాగంగా భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన అల్లుళ్లకు సకినాల పంపకం’ చేయడం ఇక్కడి ఆచారం.
సకినాలు(Sakinalu) చేయడం అంటే అంత తేలికైన పని కాదు ఎందుకంటే దీనికి ఎంతో ఓపిక, నైపుణ్యం కావాలి. తడి బియ్యపు పిండిని, వాము, నువ్వులు, ఉప్పు కలిపి ఒక పొడవైన దారంలా చేసి, నేల మీద పర్చిన గుడ్డపై గుండ్రంగా చుట్టాలి. అలా చుట్టడంలోనే వారి నైపుణ్యం కనిపిస్తాది.
ఇలా చుట్టిన సకినాలను కాసేపు ఆరబెట్టి, ఆ తర్వాత నూనెలో దోరగా వేయించి తీస్తారు.ఈ సంక్రాంతి సమయంలో ఇంట్లోని ఆడవాళ్లంతా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటూ సకినాలు చుట్టడం ఒక అందమైన దృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది .
సకినాల్లో నూనె పీల్చుకునే గుణం చాలా తక్కువగా ఉండటం వల్ల డైటింగ్ చేసే వాళ్లు కూడా ఓ పట్టు పట్టేయొచ్చు. ఇవి చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటికి ఉండే కరకరలాడే స్వభావం, వాము , నువ్వుల రుచి ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.
తెలంగాణలో సంక్రాంతి రోజున వీటిని నాటు కోడి కూరతో గానీ లేదా టమాటా పచ్చడితో గానీ తింటారు. సకినాలు కేవలం రుచి కోసమే కాదు, ఇందులో వాము ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే నువ్వులు చలికాలంలో ఎముకల పుష్టికి తోడ్పడతాయి.
Water disputes:తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు చర్చలే పరిష్కారమా? గత ఉదాహరణలు ఏం చెబుతున్నాయి?
