Non Vegetarian:భారతదేశంలో పెరుగుతున్న మాంసాహారులు. . ఎవరేం తినాలనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు??

Non Vegetarian: నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (NFHS-5) గణాంకాలను లోతుగా పరిశీలిస్తే.. భారతదేశం నెమ్మదిగా మాంసాహార ప్రియుల దేశంగా మారుతోందని తేలింది.

Non Vegetarian

భారతదేశంలో నాన్ వెజ్ తినే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్ అంటే ప్రపంచవ్యాప్తంగా శాఖాహార దేశంగా ఒక ముద్ర ఉంది. కానీ మారుతున్న కాలంతో పాటు భారతీయుల ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. తాజాగా విడుదలైన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (NFHS  5) గణాంకాలను లోతుగా పరిశీలిస్తే.. భారతదేశం నెమ్మదిగా మాంసాహార (Non vegetarian) ప్రియుల దేశంగా మారుతోందని తేలింది.

అయితే ఈ మార్పు కేవలం టాప్‌లో ఉన్న ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకో, కొన్ని ప్రత్యేక వర్గాలకో పరిమితం కాలేదు. సాంప్రదాయకంగా శాఖాహారానికి ప్రాధాన్యతనిచ్చే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా మాంసాహారం, గుడ్ల వినియోగం గణనీయంగా పెరగడం విశేషం.

ఇప్పుడు ఈ సర్వే గణాంకాలు సామాజికంగా, రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే, కొంతకాలంగా దేశంలో మాంసాహారులు అల్పసంఖ్యాక వర్గమని, దేశ మెజారిటీ జనాభా శాఖాహారులేనని ఒక ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ వాదనను అడ్డం పెట్టుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నుంచి గుడ్లను తొలగించడానికి ప్రయత్నించడంతో పాటు వీధుల్లో మాంసాహార విక్రయాలను నిషేధించడానికి పూనుకోవడం వంటి చర్యలు కూడా చేపట్టాయి. అయితే, తాజా హెల్త్ డేటా ప్రకారం, ఇప్పటికే మెజారిటీగా ఉన్న మాంసాహార జనాభాలోకి మరింత మంది కొత్తవారు చేరుతున్నారని తేలింది.

బీజేపీకి పట్టుకొమ్మగా, శాఖాహారానికి కేంద్రంగా అంతా భావించే గుజరాత్‌లో..ఈ ఐదేళ్లలోనే మాంసాహారుల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. సర్వేలో భాగంగా 33,343 మంది స్త్రీలను, 4,957 మంది మగవారిని ప్రశ్నించగా.. వారి సమాధానాలు ఆశ్చర్యం కలిగించాయి.

గతంలో అంటే 2015-16 (NFHS 4) సర్వే సమయంలో.. 30.8 శాతం మంది మహిళలు మాత్రమే మాంసాహారం తీసుకుంటే. ఇప్పుడు ఆ సంఖ్య 39 శాతానికి పెరిగింది. అలాగే మగవారి విషయంలో ఇది 43.5 శాతం నుంచి 51 శాతానికి చేరుకుంది. అంటే గుజరాత్‌లో సగానికి పైగా మగవాళ్లు ఇప్పుడు మాంసాహార ప్రియులే.

వీరిలో రెగ్యులర్‌గా నాన్వెజ్ తినేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. దాదాపు 2.4 శాతం మంది మహిళలు, 2.1 శాతం మంది పురుషులు ప్రతిరోజూ చికెన్, చేపలు లేదా మాంసాన్ని తింటున్నారు. ఇక వారానికోసారి తినేవారి శాతం 18 వరకు ఉంటే, అప్పుడప్పుడు తీసుకునే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది.

ఇక గుడ్ల వినియోగం విషయంలో కూడా గుజరాత్ దూసుకుపోతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 37.9 శాతం స్త్రీలు, 52.1 శాతం మగవారు తాము గుడ్లు తింటున్నట్లు చెప్పారు. ఇన్ని గణాంకాలు ఉన్నా కూడా తాజాగా అహ్మదాబాద్, వడోదర, రాజకోట్ వంటి నగరాల్లో మున్సిపల్ అధికారులు వీధుల్లో మాంసాహార విక్రయాలను నిషేధించడానికి ప్రయత్నించారు.

నాన్వెజ్ అమ్మకాలు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హానికరమని అధికారులు సాకులు చెప్పారు. కానీ గుజరాత్ హైకోర్టు ఈ చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలు ఏమి తినాలనేది వారి ఇష్టమని, వారి ఆహారపు హక్కులను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని కోర్టు చీవాట్లు వేసింది.

అలాగే మహారాష్ట్రలో మాంసాహార వినియోగం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది, తాజా సర్వే ప్రకారం అది మరింత విస్తృతమైంది. ఇక్కడ 71.8 శాతం స్త్రీలు, 83.2 శాతం మగవారు మాంసాహారం తింటున్నారు. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇక్కడ 1 నుంచి 2 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సుమారు 54 శాతం మంది మగవాళ్లు ప్రతి వారం మాంసాహారాన్ని కచ్చితంగా తీసుకుంటున్నారు.

మధ్యప్రదేశ్‌లో కూడా ఈ పరిస్థితులు మారుతున్నాయి. ఇక్కడ సగానికి పైగా జనాభాలో సుమారు 54 శాతం మహిళలు, 66 శాతం పురుషులు మాంసాహారులే. ఇక్కడ గుడ్ల వినియోగంపై రెగ్యులర్‌గా చర్చలు జరుగుతుంటాయి.

Non vegetarian

ముఖ్యంగా పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనంలో గుడ్లు చేర్చాలని పోషకాహార నిపుణులు ఎంత మొత్తుకుంటున్నా కూడా.. శాఖాహార వాదనలు చేసే వర్గాల ఒత్తిడి వల్ల అక్కడి ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత పిల్లల్లో పోషకాహార లోపం పెరగడంతో..గుడ్డు అనేది అత్యంత చౌకైన , శ్రేష్ఠమైన ప్రోటీన్ వనరు అని సైన్స్ చెబుతున్నా, రాజకీయ కారణాలు అడ్డుపడుతున్నాయి.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కూడా సుమారు 54 శాతం స్త్రీలు, 66 శాతం మగవారు మాంసాహారం(Non Vegetarian) తీసుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ఇక్కడ గుడ్లు తినేవారి శాతం కూడా గణనీయంగానే పెరిగింది. మహిళల్లో ఎగ్స్ వినియోగం 56 శాతం నుంచి 60 శాతానికి చేరింది. దీంతో యూపీ లాంటి రాష్ట్రంలో మాంసాహారం(Non Vegetarian) పై రకరకాల ఆంక్షలు ఉన్నా, ప్రజల వ్యక్తిగత ఆహారపు అలవాట్లలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు..పైగా అది పెరుగుతోందని అర్థమవుతోంది.

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మాంసాహారుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ 77.6 శాతం మహిళలు, 85.4 శాతం పురుషులు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. అయితే, తాజాగా కర్ణాటకలో లింగాయత్ వర్గానికి చెందిన కొందరు నాయకులు పాఠశాలల్లో కేవలం శాఖాహారమే పెట్టాలని డిమాండ్ చేయడంతో.. దీనిని విద్యార్థులు స్వయంగా వ్యతిరేకించడం హాట్ టాపిక్ అయింది.

Non vegetarian

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా అస్సలు మాంసాహారం(Non Vegetarian) ముట్టని పురుషుల సంఖ్య ఐదేళ్లలో 5 శాతం తగ్గింది. అంటే 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న పురుషుల్లో కేవలం 16.6 శాతం మంది మాత్రమే పూర్తి శాఖాహారులుగా మిగిలారు. మిగిలిన వారందరూ ఏదో ఒక రూపంలో మాంసాహారాన్ని స్వీకరిస్తున్నారు. మహిళల విషయంలో మాత్రం ఈ సంఖ్య 30 శాతం వద్ద స్థిరంగా ఉంది.

మొత్తంగా భారత్‌లో నాన్వెజ్ అనేది కేవలం ఒక వర్గానికి చెందిన అలవాటు కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఒక లైఫ్ స్టైల్ అని ఈ సర్వేతో తేలింది.. ప్రజల ఆహారపు అలవాట్లపై ఆంక్షలు విధించడం, ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపడం లేదా చూడటం అనేది శాస్త్రీయంగా ,సామాజికంగా తప్పని ఈ గణాంకాలు ప్రూవ్ చేశాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version