Ishan Kishan : ఇది కదా విధ్వంసం..ఇషాన్ కిషన్ శతక్కొట్టుడు

Ishan Kishan : ఇషాన్ కిషన్ వీరబాదుడికి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బంతి ఎలా వేసినా బాదేయడంతో కివీస్ ఆటగాళ్ళంతా ప్రేక్షకుల్లా మిగిలిపోయారు

Ishan Kishan

టీ20 ప్రపంచకప్ కు ముందు భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్(Ishan Kishan) శివాలెత్తిపోయాడు. తిరువనంతపురం వేదికగా సెంచరీతో దుమ్మురేపాడు. కొడితే సిక్సర్ లేకుంటే బౌండరీ అన్న తరహాలో అతని ఇన్నింగ్స్ సాగింది. ఇషాన్ కిషన్ వీరబాదుడికి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బంతి ఎలా వేసినా బాదేయడంతో కివీస్ ఆటగాళ్ళంతా ప్రేక్షకుల్లా మిగిలిపోయారు.

ఈ మ్యాచ్ లో చాలా మంది సంజూ శాంసన్ ఆట చూద్దామని ఎదురుచూశారు. కానీ సంజూ శాంసన్, అభిషేక్ శర్మ త్వరగానే ఔటవడంతో కాస్త నిరాశ చెందారు. అయితే నిమిషాల వ్యవధిలోనే వారిని నిరాశను తీసేసాడు ఇషాన్ కిషన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అసలు బంతి వేసేందుకు కూడా కివీస్ బౌలర్లు భయపడినట్టు కనిపించింది. ఎందుకంటే ఆఫ్ సైడ్ స్టంప్ కు దూరంగా బాల్ వేసినా దానిని వెంటాడి మరీ సిక్సర్ బాదాడంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఇష్ సోధి వేసిన 12వ ఓవర్లో అయితే ఇషాన్ కిషన్(Ishan Kishan) విధ్వంసం తారాస్థాయికి చేరింది. వైడ్ తర్వాత మొదటి మూడు బంతులను ఫోర్లు బాదిన ఇషాన్ కిషన్(Ishan Kishan) తర్వాత సిక్సర్ , ఫోర్ , సిక్సర్ తో కలిపి మొత్తం 29 పరుగులు పిండుకున్నాడు. అతని విధ్వంసానికి భారత్ రన్ రేట్ ఓవర్ కు 13కు పైగా సాగింది. ఇషాన్ కిషన్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపు బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. 30 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 91 పరుగుల దగ్గర వరుసగా రెండు సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.

Ishan Kishan

టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఐదో భారత బ్యాటర్ గా నిలిచాడు. గతంలో రోహిత్ శర్మ 35 బంతుల్లోనూ, అభిషేక్ శర్మ 37 బంతుల్లోనూ, సంజూ శాంసన్ 40 , తిలక్ వర్మ 41 బంతుల్లో శతకాలు సాధిస్తే.. ఇషాన్ కిషన్ 42 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2025కు ముందు క్రమశిక్షణ పాటించకపోవడం, ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ గత ఆరు నెలలుగా దేశవాళీ క్రికెట్ అదరగొడుతున్నాడు.

జార్ఖండ్ కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్(Ishan Kishan) వ్యక్తిగతంగానూ సత్తా చాటాడు. ఈ కారణంగానే ప్రపంచకప్ జట్టులో సైతం చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు మెగాటోర్నీకి ముందు సూపర్ ఫామ్ లో ఉండడం భారత్ అభిమానులుకు ఎక్కడలేని జోష్ ఇస్తోంది.

T20 World Cup : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..వరల్డ్ కప్ నుంచి కమ్మిన్స్ ఔట్

Exit mobile version