culture : హైదరాబాద్‌ను కుదిపేస్తున్న కొత్త కల్చర్..

culture : యువతరం జీవితాలపై, సామాజిక విలువలతో యుద్ధం చేస్తూ.. రాజకీయ తుఫానును కూడా రాజేస్తోంది.

culture :మారిన కాలంతో పాటు మారిపోయే మన హైదరాబాద్‌.. ఈసారి ఓ విచిత్రమైన, వివాదాస్పదమైన అలవాటును అక్కున చేర్చుకుంటోంది. విదేశాల నుంచి ట్రెండ్ పేరుతో అడుగుపెట్టిన ఈ కో-లివింగ్(co-living) కల్చర్.. ఇప్పుడు భాగ్యనగరాన్ని కుదిపేస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి విస్తరించిన ఈ జీవనశైలి.. తెలుగు రాష్ట్రాలైన విశాఖపట్నం, విజయవాడకు కూడా పాకుతోంది. ఇది కేవలం అద్దె ఇంటి వ్యవహారం కాదు.. యువతరం జీవితాలపై, సామాజిక విలువలతో యుద్ధం చేస్తూ..  రాజకీయ తుఫానును కూడా రాజేస్తోంది. అసలు ఏంటి ఈ కో-లివింగ్? ఎందుకు ఇంత పెద్ద రచ్చ? దాని వెనుక దాగున్న వాస్తవాలేంటి చూద్దాం.

culture

ఒకప్పుడు అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడటానికి ఆలోచించిన సమాజం మనది. స్కూళ్లు, హాస్టళ్లు కూడా వేర్వేరుగానే నడిచేవి. కాలం మారింది.. కో-ఎడ్యుకేషన్ వచ్చింది. అయితే, ఇప్పుడు ఇదంతా దాటి.. ‘బయోలాజికల్ ఫ్యామిలీ’ కాకుండా, ఎలాంటి రక్త సంబంధం లేని యువతీ యువకులు.. ఒకే ఇంట్లో, ఒకే హాస్టల్‌లో కలిసి నివసించడాన్నే కో-లివింగ్ అంటున్నారు. ఉన్నత చదువుల కోసం మహానగరానికి వలస వచ్చిన విద్యార్థులు, టెకీ జీవితం గడుపుతున్న ఐటీ ఉద్యోగులు ఈ ‘ఫ్రీడం’ కల్చర్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, KPHB, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి హై-ఎండ్ ప్రాంతాల్లో ఈ కో-లివింగ్ స్పేస్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

కో-లివింగ్ హాస్టళ్ల నిర్వాహకులు యూత్ కలలు కనే ప్రతి సౌకర్యాన్నీ అందిస్తున్నారు. కేవలం బెడ్, టీవీ, ఫ్రిజ్, ఏసీ, వైఫై మాత్రమే కాదు.. వాషింగ్ మెషీన్, మినరల్ వాటర్, హైటెక్ కిచెన్.. ఇలా అన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. కొన్నిచోట్ల ఫర్నీచర్, స్విమ్మింగ్ పూల్ వంటి ఫెషిలిటీలు కూడా ఉన్నాయి. యువత నెలకు రూ.8 వేల నుంచి ఏకంగా రూ.25 వేల వరకు అద్దె చెల్లిస్తోంది. కాస్త ఖర్చు ఎక్కువయినా సరే, ఈ ఆధునిక జీవనశైలి యువత(Youth)ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు రహస్యంగా ఉండే ఈ కో-లివింగ్ హాస్టళ్లు, ఇప్పుడు ఓపెన్‌గా యాడ్స్ గుప్పిస్తూ యూత్‌ను రప్పించుకునే స్టేజ్‌కు వెళ్లిపోయాయి.

ఈ కో-లివింగ్ కల్చర్ (Trend)ఇప్పుడు హైదరాబాద్ సామాజిక వాతావరణంలో పెద్ద దుమారం రేపుతోంది. ఇదంతా మన దేశ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని.. యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని మెజారిటీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారు కలిసి ఉండవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఉన్నా కూడా, నైతికంగా, భద్రతాపరంగా ఇది సరైనది కాదనేది వారి వాదన. ఇటీవలే, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఈ కో-లివింగ్ హాస్టళ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీటిపై ప్రభుత్వం తక్షణం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. ఆయన వాదనకు పెద్ద ఎత్తున ప్రజా మద్దతు లభిస్తుండగా, కొందరు మాత్రం దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేపని అంటూ వ్యతిరేకిస్తున్నారు.

అయితే కో-లివింగ్ హాస్టళ్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, కఠిన నిబంధనలు అమలులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది యువతుల భద్రత(Safety Issues)కు పెను ప్రమాదం. నేరాలు పెరిగే అవకాశం ఉందని సామాజిక వేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కలిసి నివసించే వారి మధ్య తగాదాలు తలెత్తినప్పుడు..పాత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసే ఉదంతాలు పెరుగుతున్నాయని తెలుస్తోంది.

కొన్నిచోట్ల, హాస్టల్ నిర్వాహకులే అమ్మాయిలను ‘రూమ్‌మేట్స్‌’గా సెట్ చేస్తామంటూ అబ్బాయిల నుంచి డబ్బులు గుంజుతున్న దారుణాలు కూడా బయటపడ్డాయంటే ఇది ఏ స్టాయికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, తమ పిల్లలు ఇలా కో-లివింగ్‌లో ఉన్నారన్న విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడం మరింత ఆందోళనను పెంచుతోంది. అంతేకాదు ఇప్పటికే ఇలాంటి జంటల మధ్య కేసులు నమోదైన ఘటనలు చాలా ఉన్నాయి.

ఈ కో-లివింగ్ కల్చర్ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో దశాబ్దాల తరబడి ఒక సాధారణ జీవన విధానం. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో, మన భారతీయ యువత కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి, భద్రత కోసం, లేదా ఒకే ప్రాంతం వాళ్లమనే భావన కోసం కలిసి జీవిస్తారు. వారి తల్లిదండ్రులు కూడా దీన్ని సాధారణ విషయంగానే పరిగణిస్తారు. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, జపాన్ వంటి ఆసియా దేశాల్లో కూడా ఆర్థిక భారం తగ్గించుకోవడానికి చిన్న కుటుంబాలు సైతం పెద్ద ఇళ్లను షేర్ చేసుకుంటాయి.

కానీ, మన భారతీయ సంస్కృతిలో, నైతిక విలువల.. ఇది ఒక సామాజిక సవాల్‌గా మారింది. కేవలం ‘ట్రెండ్’ కోసం, ‘ఎంజాయ్’ చేద్దామని, లేదా ‘స్వేచ్ఛ’ దొరికిందనే ఉద్దేశంతో అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కలిసి ఉంటున్నారంటే అది శారీరక సంబంధమే అన్న ఆలోచన నుంచి బయటకు రావాలని, కాలంతో పాటు నైతిక విలువలు, సామాజిక కట్టుబాట్లు మారుతూ ఉంటాయని కో-లివింగ్ భాగస్వాములు వాదిస్తున్నారు. ఈ సరికొత్త జీవనశైలి హైదరాబాద్‌ సమాజంలో ఎలాంటి మలుపులు తిప్పుతుందో, దానిపై ప్రభుత్వ నియంత్రణలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Exit mobile version