Sleep terrors
కొంతమంది రాత్రి పూట గట్టిగా అరుస్తూ వణికిపోతూ పక్కన ఉన్నవారిని హడలగొడుతూ ఉంటారు. అది ఒక్కరోజో, రెండు రోజులో అయితే ఓకే కానీ తరచూ ఇలా జరిగితే మాత్రం వారి పక్కన పడుకోవడానికి కూడా భయపడతారు. అది పక్కన పెడితే అసలు వారు అలా ప్రవర్తించడానికి కారణం ఏంటనేది తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లడం ముఖ్యం.
దీనిని స్లీప్ టెర్రర్స్(Sleep terrors) లేదా నైట్ టెర్రర్స్ అని పిలుస్తారు. నిద్రలో జరిగే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను పారాసోమ్నియాగా పరిగణిస్తారు. దీని ప్రధాన లక్షణాలు నిద్రలో భయంతో అరుపులు, తీవ్రమైన భయం. ఇది సాధారణంగా సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. ఇది పిల్లల్లో సుమారు 40 శాతం మందిలో కనిపిస్తుంది, కానీ పెద్దల్లో చాలా తక్కువ శాతం మందిలో కూడా సంభవించొచ్చు. స్లీప్ టెర్రర్స్(Sleep terrors) అనేవి పీడకలలు కాదని గమనించాలి.
నిద్రలో భయంతో (Sleep terrors) అరిచేటప్పుడు కళ్లు పెద్దవిగా చేసి చూడటం, మంచం మీద కూర్చొని భయంగా కనిపించడం, వేగంగా ఊపిరి పీల్చుకోవడం, మొహం ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వారిని నిద్రలేపడానికి ప్రయత్నిస్తే కొట్టడం, తన్నడం వంటివి కూడా చేయవచ్చు. మరుసటి రోజు ఉదయం వారికి ఆ రాత్రి జరిగిన విషయం ఏమాత్రం గుర్తుండదు.
యుక్తవయసు తర్వాత కూడా ఈ సమస్య కొనసాగుతున్నా, దానివల్ల పగటి పూట ఎక్కువగా నిద్ర వచ్చి పనిలో సమస్యలు ఎదురవుతున్నా వెంటనే సైకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. వైద్యులు శారీరక, మానసిక పరీక్షలు చేసి, అవసరమైతే ‘పాలిసోమ్నోగ్రఫీ’ అనే నిద్ర అధ్యయనానికి సిఫారసు చేస్తారు.
స్లీప్ టెర్రర్స్ అనేవి NREM నిద్ర యొక్క లోతైన దశలో సంభవిస్తాయి. కుటుంబ సభ్యులకు ఇలాంటి నిద్ర రుగ్మతల చరిత్ర ఉన్నా, లేదా నిద్ర లేమి, విపరీతమైన అలసట, మానసిక ఒత్తిడి వంటివి ఉన్నా ఇది సర్వసాధారణం. ఈ సమస్య పిల్లల్లో, మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే తరచూ ప్రయాణాలు, జ్వరం, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్, ఆందోళన , మద్యం వినియోగం కూడా దీనికి కారణాలుగా చెప్పవచ్చు.
మీకు లేదా మీ పిల్లలకు ఈ సమస్య ఉంటే, దాన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. నిద్రలేమి ఉంటే, ఒక నిర్దిష్ట సమయానికి నిద్రపోయే షెడ్యూల్ పాటించడం, మొబైల్ ఫోన్‌లను దూరంగా ఉంచడం వంటివి చేయాలి. నిద్రవేళకు ముందు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. స్లీప్ టెర్రర్స్ వల్ల గాయపడే అవకాశం ఉంది కాబట్టి బెడ్‌రూమ్‌ను సురక్షితంగా ఉంచడం, పదునైన వస్తువులను అందుబాటులో లేకుండా చూసుకోవడం ముఖ్యం.
నిద్రకు ముందు పుస్తకాలు చదవడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా ధ్యానం చేయడం వంటివి మంచి నిద్రకు సహాయపడతాయి. పిల్లల విషయంలో, వారికి నిద్రలో ఎంత సమయానికి ఈ ఎపిసోడ్ వస్తుందో గమనించి, దానికి పది నిమిషాల ముందు వారిని నిద్రలేపితే ఆ సమస్యను నివారించవచ్చు. ఒకవేళ స్లీప్ టెర్రర్ ఎపిసోడ్ వస్తే, వారిని కదిలించడం లేదా అరవడం కంటే ప్రశాంతంగా కౌగిలించుకుని ఓదార్చడం మంచిది. ఈ పద్ధతులు ఏవీ పనిచేయకపోతే నిపుణుడైన తప్పనిసరిగా సైకాలజిస్ట్‌ను కలవాలి.
Also Read: Jagan: ఓట్ల గల్లంతు ఆరోపణలు..జగన్ ఆరోపణల వెనుక రాజకీయ వ్యూహం అదేనా..!