Jagan: ఓట్ల గల్లంతు ఆరోపణలు..జగన్ ఆరోపణల వెనుక రాజకీయ వ్యూహం అదేనా..!
Jagan:వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Jagan
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan)చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఉప ఎన్నికల నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పోలింగ్ జరిగిందని, ఇలాంటి ఎన్నికలు మానుకోవడమే మంచిదని అన్నారు.
వైసీపీ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించకుండా బయటకు నెట్టేశారని జగన్ (Jagan)ఆరోపించారు. బ్యాలెట్ బాక్స్‌కు సీల్ పడే వరకు ఏజెంట్ ఉండాలని, కానీ అలా జరగలేదని జగన్ ఆరోపించారు.
ఎన్నికల భద్రత పేరుతో వందల మంది పోలీసులను మోహరించి, ప్రజలకు భయం కలిగించారని, పోలింగ్ కేంద్రాల్లో పోలీసుల దౌర్జన్యం జరిగిందని విమర్శించారు.ఓటర్లను అడ్డుకోవడం, స్లిప్పులను లాక్కోవడం వంటి అరాచకాలు జరిగాయని, ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని జగన్ అన్నారు.
ఈ పరిస్థితులపై ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోవడం దురదృష్టకరమని, అది ఒక డమ్మీగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ ఎన్నికలపై ఉన్న అనుమానాల దృష్ట్యా, తాము న్యాయపోరాటం చేసి కోర్టులో కేసులు వేస్తామని జగన్ స్పష్టం చేశారు.

అంతేకాదు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 48 లక్షల ఓట్లు అనుమానాస్పదంగా పెరిగినా రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని జగన్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడుతో టచ్‌లో ఉన్నారని, అందుకే కాంగ్రెస్ నేతలు అమరావతి స్కామ్‌ల గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.
Also Read: Basavatarakam:ఏపీలోనూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్..సేవలు ఎప్పటి నుంచి అంటే..
ఎన్నికల వ్యవస్థను ఇలాగే అవమానిస్తే, చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పతనం అవుతోందో చూపిస్తున్నాయని జగన్ అన్నారు. ఈ రెండు ఉప ఎన్నికలను రద్దు చేసి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా, ఆయన రాహుల్ గాంధీ( Rahul Gandhi), రేవంత్ రెడ్డి(Revanth Reddy), చంద్రబాబు నాయుడులను ఒకే కూటమిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా, ఓట్ల చోరీ ఆరోపణలను వినియోగించి, కాంగ్రెస్, టీడీపీల మధ్య అనధికారిక ఒప్పందం ఉందని ప్రజలను నమ్మించాలని జగన్ చూస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వ్యూహంలో భాగంగా, 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమికి కారణం పార్టీ వైఫల్యం కాదని, ప్రతిపక్షాల కుట్ర అని ప్రజలను విశ్వసించేలా చేయడం ఒక ముఖ్య ఉద్దేశమని విశ్లేషకులు అంటున్నారు. ఇది పార్టీ కార్యకర్తలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారిని తిరిగి పుంజుకునేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు.
అంతేకాకుండా, జగన్ తనను తాను ఓట్ల చోరీపై పోరాడుతున్న ఒక ప్రజాస్వామ్య రక్షకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా, జాతీయ స్థాయిలో తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ వ్యూహాలన్నీ ప్రత్యర్థులను ఒకేసారి బలహీనపరిచి, భవిష్యత్ రాజకీయాల కోసం ఒక కొత్త వేదికను నిర్మించుకోవడానికి ఉద్దేశించినవని భావిస్తున్నారు.