Flight mode
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లలో ఫ్లైట్ మోడ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మనం విమానంలో ప్రయాణించేటప్పుడు ఫ్లైట్ సిబ్బంది ఈ ఆప్షన్‌ను ఆన్ చేయమని సూచిస్తారు. కానీ, దాని వెనుక ఉన్న కారణం చాలామందికి తెలియదు.
ఫ్లైట్ మోడ్ (Flight mode)ఎలా పనిచేస్తుంది?..ఫ్లైట్ మోడ్ ఆన్ చేసినప్పుడు, ఫోన్‌లోని అన్ని వైర్‌లెస్ కనెక్షన్లు వైఫై, బ్లూటూత్, నెట్‌వర్క్ నిలిచిపోతాయి. ఈ కనెక్షన్లు రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తాయి. మీరు మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టకపోతే, మీ ఫోన్ నెట్‌వర్క్ కోసం సిగ్నల్‌ను వెతుకుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో విడుదలయ్యే ఫ్రీక్వెన్సీలు కొన్ని సందర్భాల్లో విమానంలోని కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగించవచ్చు.
ప్రమాదం ఎక్కడ ఉంది?..విమానంలో పైలట్‌లు కంట్రోల్ టవర్, ఇతర విమానాలతో మాట్లాడటానికి రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తారు. మీ ఫోన్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీలు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్‌కు దగ్గరగా ఉంటే, పైలట్ స్పీకర్‌లో వచ్చే మాటలకు బదులుగా శబ్దాలు వినిపించవచ్చు. ఇది పైలట్‌కు గందరగోళం కలిగించి, అత్యవసర సమాచారాన్ని సరిగా వినకుండా చేయవచ్చు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఫ్లైట్ సిబ్బంది ప్రయాణికులకు ఫ్లైట్ మోడ్ తప్పనిసరి అని చెబుతారు.
విమాన ప్రయాణంలో వైఫై, బ్లూటూత్ వాడొచ్చా?..చాలా ఆధునిక విమానాలలో, వైఫై ,బ్లూటూత్‌ను ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది. ఎందుకంటే అవి విమాన వ్యవస్థకు అంతరాయం కలిగించకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. కానీ, ఫోన్ సిగ్నల్స్ మాత్రం ఇంకా ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. కొన్ని దేశాలు, విమానయాన సంస్థలు ఫ్లైట్ మోడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తాయి. ప్రయాణికులందరి భద్రత కోసం ఈ నియమాన్ని పాటించడం చాలా అవసరం.