Literature
అర్మిలి
తెలవారిన తెలియట్లా
నడి రేయయినా నిదరట్లా
నీ తలపున నేనుంటే
రేయి పగలు ఒకటంటా..
ఎద చాటుకి కనుపాపకి
దారెట్టా తెలిసిందో
నీ పతిమను మోసుకొచ్చి
పదిలంగా దాచుకుంది..
నా మనసెరిగిన మతి ఎపుడూ
నీ జతనే కోరిందే
అది అతి మాత్రం అనుకోక
నా గతి మార్చే స్థితి తేవే..
మాటాడే కనులుంటే
మనసెట్టా దాస్తావే
నీ మౌనానికి భాషుంటే
ఆ లిపి నే రాస్తానే..
సరిజోడూ జతగాడూ
అని జనమంతా అంటారే
నా పక్కన నువ్వుంటే
ఈ లోకంనే కొంటానే..
నువ్వు లేని నా పయనం
శూన్యంగా తోస్తుందే
నీ జతగా నా జీవనం
సంపూర్ణం అవుతుందే..
నా జగతిని వెలిగించే
చందమామ నువ్వేలే
నీ వెలుగుల వరముకు వేచే
కలువ తపసిని నేనేలే..
ముద్దు మోములో ముగ్ధ నవ్వుతో
ఒక చిన్న ఆశీయవే
పొద్దుతిరుగుడు పువ్వులా
నిను చూస్తూ శ్వాసిస్తా
__ఫణి మండల