Literature:
భారతీయులందరూ నా సహోదరులు
అని ప్రతిజ్ఞ చెపుతుంటే
ఉప్పొంగిన హృదయం …
ఒక్కోసారి ఉప్పెనొచ్చి మీద పడినట్లు
తల్లడిల్లి పోతుంది ..
ఒక ఢిల్లీయో, ఒక హైదరాబాదో
ఒక గ్రామ పొలిమేరో
ఒక పట్టణ శివారో
ఎక్కడైనా…. ప్రాంతమేదైనా
ఊరకుక్కల్లా కామాంధులు కాటేస్తుంటే
చట్టం భయపెట్టడం లేదు
న్యాయంలో ఉదాసీనత పోలేదు..
విచ్చలవిడి మత్తుపదార్థాలు
విశృంఖల మనస్తత్వాలు
వసంతాలను చిదిమేస్తుంటే
ఎవరి సోదరో..? ఎవరి బిడ్డనో..?
ఎవరతేనేం..?
అయ్యో! పాపం అనుకుంటూ
టీవీ ముందు కంచం పట్టుకొని కూర్చుని
అన్నంతో పాటు ఆవేదనను
దిగమింగేస్తున్నాం..
ఇంక్రెడిబుల్ ఇండియా అంటూ
మనల్ని మనమే పొగిడేసుకుంటున్నాం..
“విశ్వగురువు” అనే బిరుదు కట్టుకుంటూ
స్వయం భ్రమలో మునిగిపోతున్నాం..
మహిళా సాధికారతలో
ముందున్నామంటూ మనల్ని మనమే
పొగిడేసుకుంటున్నాం..
అభివృద్ధి అంటే
తలో కారు కొనుక్కోవడమో..
తలసరి ఆదాయం పెరగడమో కాదు..
ప్రతి తలలోనూ సంస్కారం నింపడమే ..!
మన పురాణాలలో మన చరిత్రలో
అత్యాచారం అనే పదం
మచ్చుకైనా కనిపించదే..
ధుర్యోధన,దుశ్శాసనులు,
రావాణాసుర రాక్షసులు
వీళ్లకంటే నయమనిపించలేదూ..
ఎక్కడదీ సంస్కృతి ?
ఎవరు పెంచారీ వికృతి?
మత్తు మూలాలు వదిలించకుండా
భద్రత భరోసా పెంచకుండా
శిక్షలు భయపెట్టకుండా
అధిక జనాభా ఉన్న దేశంలో
అరాచకాన్ని ఎలా ఆపగలం..?
లోపభూయిష్టమైన చట్టాల వలన
చెలరేగిపోతున్న చెత్త వెధవల
చేతికి బేడీలు వేయించలేకున్నా
రక్ష మాచల మాచల అంటూ
చెల్లీ నిన్ను రక్షిస్తామంటూ
చేతికి రాఖీలు మాత్రం
కట్టించేసుకుందాం..!
అయ్యా!
దేశ్‌కీ నేతాలు, దేశోద్ధారకులు
మీ అందరికీ
రక్షాబంధన్ శుభాకాంక్షలు..
—ఫణి మండల