ఎన్నాళ్లయిందో..!
మనం మనతో మాట్లాడుకొని
ఎన్నాళ్లయిందో…
మన మనసుల్లోకి తొంగిచూసి
ఎన్నాళ్లయిందో…
పెద్ద కలలకై పరిగెత్తుకుంటూ
చిన్న ఆనందాలు వాయిదా వేస్తూ
జీవిత పరమార్థం మరిచిపోయి
ఎన్నాళ్లయిందో…
యాంత్రిక పరిభ్రమణంలో పడి
ఆత్మభ్రమణం మానేసి
అద్దంలాంటి మనసుతో యుద్ధం చేసి
ఎన్నాళ్లయిందో..
గంటలు గంటలు చరవాణి యాగంలో
జీవితం సగమై నిరర్ధకంగా వెలిసిపోతుంటే
అలసిన కళ్ల వెనుక నిజం రంగుల్ని చూసి
ఎన్నాళ్లయిందో…
చరవాణి వెలుతురు
ముఖాన్ని కప్పేసినపుడు
మన లోపల వెలుతురు మసకబారి
ఎన్నాళ్లయిందో…
ఉదయం సందేశాలు మొదలు
నీ చేతి వేళ్లు లేళ్లలా పరుగులు తీస్తూ
నీ జ్ఞానాన్ని నిలువునా తొక్కేసి
ఎన్నాళ్లయిందో..
నలుగురిలో తలెత్తి కూర్చుని
నాలుగు మాటలు ఎదురుగా చెప్పి
తనివితీరా నవ్వి గుండెలకు దగ్గరయ్యి
ఎన్నాళ్లయిందో…
హృదయం చెప్పే కబుర్లు విని
గాలి పాడే పాటలకు మనసు నర్తించి
ప్రకృతికి మనసు పరవశించి
ఎన్నాళ్లయిందో…
కొద్దిసేపు ఈ యాంత్రిక జీవితం పక్కనెట్టి
మనమే మనతో మళ్లీ కలవాలి!
మన మనసుని మనం గెలవాలి..!
ఫణి శేఖర్
8555988435