Constitution Day
భారతదేశంలో 76వ రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) నవంబర్ 26న ఢిల్లీలోని చారిత్రక సంవిధాన్ సదన్‌లో (పార్లమెంట్ సెంట్రల్ హాల్) అత్యంత వైభవంగా జరిగింది. రాజ్యాంగాన్ని స్వీకరించిన ఈ పవిత్ర దినం సందర్భంగా, దేశ సర్వోన్నత చట్టం యొక్క ప్రాముఖ్యతను, దాని మౌలిక విలువలను పౌరులకు గుర్తు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి , ప్రధానమంత్రి సహా దేశ అగ్ర నాయకత్వం పాల్గొంది.
కార్యక్రమం ప్రారంభంలో, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు నాయకులందరూ ఘనంగా నివాళులు అర్పించారు. భారత ప్రజాస్వామ్యానికి ఆయన అందించిన సేవలు, దూరదృష్టి, దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వాన్ని కల్పించడంలో ఆయన కృషిని ప్రస్తుతించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటు, పౌరులు తమ ప్రాథమిక విధులను (Fundamental Duties) తప్పక తెలుసుకోవాలని, వాటిని నిర్వర్తించాలని ఉద్ఘాటించారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి పాత్ర ఎంత కీలకమో ఆమె నొక్కి చెప్పారు. “రాజ్యాంగంపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే, మన ప్రజాస్వామ్యం మరింత పరిణతి చెందుతుంది,” అని ఆమె తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అనేది కేవలం చట్టాల సంకలనం మాత్రమే కాదని, ఇది దేశ సమైక్యత (Unity) , సమగ్రత (Integrity)కు పునాది అని వివరించారు. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ముఖ్యంగా దేశ యువతపై ఉందని, వారు ఈ వారసత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ 76వ రాజ్యాంగ దినోత్సవ (Constitution Day)వేడుకల్లో జరిగిన అత్యంత ముఖ్యమైన మరియు చారిత్రక ఘట్టంగా భారత రాజ్యాంగాన్ని 9 (తొమ్మిది) ప్రాంతీయ భాషల్లోకి అనువదించిన ప్రతులను విడుదల చేయడం నిలిచింది. భారత రాజ్యాంగాన్ని మొదట తెలుగు, మలయాళం, మరాఠీ, నేపాలీ,పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ మొదలైన ప్రాంతీయ భాషల్లోకి అనువదించి విడుదల చేశారు.
రాజ్యాంగంపై అవగాహన (Constitutional Literacy).. రాజ్యాంగాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం ద్వారా, దేశంలోని సామాన్య పౌరులు, ముఖ్యంగా తమ మాతృభాషలో విద్యనభ్యసించిన వారు, చట్టపరమైన క్లిష్టమైన పదాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. తమ మాతృభాషలో హక్కులు, విధులు , రాజ్యాంగ నిర్మాణం గురించి తెలుసుకోవడం వల్ల పౌరులు మరింత సాధికారత పొందుతారు.
ఈ చర్య భారత దేశంలో ఉన్న భాషా వైవిధ్యాన్ని గౌరవించడంతో పాటు, రాజ్యాంగ స్ఫూర్తిని దేశం నలుమూలలా బలంగా వ్యాప్తి చేయడానికి దోహదపడుతుంది. ఈ అనువాద ప్రక్రియ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిపోనుంది.
