Heritage building: కూలిపోయిన ప్రపంచ వారసత్వ కట్టడం..ఏంటి దీని ప్రత్యేకత

Heritage building:హుమాయూన్ సమాధిని మొగల్ చక్రవర్తి హుమాయూన్ భార్య బేగమ్ హమీదా బానూ 1565-1572 కాలంలో నిర్మించారు. దీన్ని మొగల్, పర్షియన్, ఆఫ్ఘన్ శైలుల కలయికతో రూపొందించారు.

Heritage building

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న 16వ శతాబ్దపు అద్భుత కట్టడం హుమాయూన్ సమాధి భారీ వర్షాలకు కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పర్యాటకులు అక్కడే ఉండటంతో, వారిలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన ఢిల్లీ ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

అయితే హుమాయూన్ సమాధి పూర్తిగా కూలిపోలేదు. కేవలం దానిలోని ఒక భాగం మాత్రమే భారీ వర్షాల ధాటికి దెబ్బతింది. ఈ ప్రమాదానికి
ఇటీవలి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణంలో వచ్చిన విపరీతమైన మార్పులతో పాటు కాలక్రమేణా శిలాఖండాలు, నిర్మాణ వస్తువులు బలహీనపడటం ప్రధాన కారణాలు అని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు వెంటనే స్పందించి, పర్యాటక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు.

పురావస్తు శాఖ, స్థానిక ప్రభుత్వం, యునెస్కో అధికారులు ఈ కట్టడాన్ని పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Heritage building

Heritage building

హుమాయూన్ సమాధిచరిత్ర, ప్రాముఖ్యత గురించి ఒకసారి చూస్తే..ఈ కట్టడం కేవలం ఒక సమాధి మాత్రమే కాదు. దీనికి చారిత్రకంగా, కళాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.

హుమాయూన్ సమాధిని మొగల్ చక్రవర్తి హుమాయూన్ భార్య బేగమ్ హమీదా బానూ 1565-1572 కాలంలో నిర్మించారు. దీన్ని మొగల్, పర్షియన్, ఆఫ్ఘన్ శైలుల కలయికతో రూపొందించారు.

ఎర్ర ఇసుకరాయి, తెల్ల రాయి మిశ్రమంతో దీన్ని నిర్మించారు. ఈ సమాధి చుట్టూ ఉన్న చతుర్భుజ ఆకారపు తోటలు, ‘చార్‌బాగ్‌’ పద్ధతిలో భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి తోటలు ఇవి.

హుమాయూన్ సమాధి, ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్‌ నిర్మాణానికి స్ఫూర్తిగా నిలిచిందని చరిత్రకారులు చెబుతారు. దీని అపురూప కళా విలువను గుర్తించి, 1993లో యునెస్కో ఈ సమాధిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.

ఈ కట్టడంలో చక్రవర్తి హుమాయూన్‌తో పాటు 150 మందికి పైగా మొగల్ కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి.

2025లో జరిగిన ఈ ఘటన మన వారసత్వ సంపద భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వందల సంవత్సరాల పాటు నిలబడిన ఈ కట్టడాలు ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ప్రమాదంలో పడుతున్నాయి. ఈ ప్రమాదం మనకు ఒక సంకేతం. మన పూర్వీకుల కళా వైభవాన్ని, చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

హుమాయూన్ సమాధి అంటే కేవలం ఒక చారిత్రక నిర్మాణం కాదు. అది మొగల్ చరిత్రకు, ప్రపంచ శిల్పకళకు, ఢిల్లీ నగర గర్వానికి ఒక నిలువెత్తు సాక్ష్యం. ఇప్పుడు, ఈ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడానికి తక్షణ మరమ్మతులు, పటిష్టమైన సంరక్షణ చర్యలు చాలా అవసరం.

 

Exit mobile version