Pollution: మీ ఊపిరితిత్తులు పీల్చుకునేది గాలి కాదు, విషం..షాకింగ్ రిపోర్ట్స్
Pollution: కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు N95 మాస్క్‌లు వాడటం, ఇంటి లోపల గాలిని శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి

Pollution
ఢిల్లీ వంటి అత్యంత కాలుష్యభరితమైన నగరంలో కేవలం ఒక ఏడాది నివసించడం వల్ల మీ ఊపిరితిత్తులకు జరిగే నష్టం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దీనిపై జరిపిన ఒక తాజా అధ్యయనం షాకింగ్ నిజాలను వెల్లడించింది. ఢిల్లీ నివాసితులలో 40.3% మందికి ఊపిరితిత్తుల పనితీరు తగ్గిపోయిందని ఆ అధ్యయనం పేర్కొంది. ఇది స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతాలతో పోలిస్తే దాదాపు రెట్టింపు. ఇది కేవలం ఒక గణాంకం కాదు, మన ఆరోగ్యంపై కాలుష్యం(Pollution) ఏ రేంజ్‌లో ప్రభావం చూపిస్తుందనడానికి పెద్ద ఉదాహరణ .
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరితమైన నగరాల్లో ఒకటైన ఢిల్లీలో గాలిలో ఉండే ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM2.5) పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో నిర్దేశించిన సురక్షిత ప్రమాణం ప్రకారం 255 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్ ఉండాలి.
కానీ, ఢిల్లీలో ఆ పరిమాణం 400-500 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్లకు చేరుకుంటుంది. అంతర్జాతీయ ప్రమాణం కేవలం 40 మైక్రోగ్రాములు మాత్రమే అని గమనిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
ఈ కాలుష్యం (Pollution) వల్ల ఢిల్లీలో నివసించే వారిలో దాదాపు 40.3% మంది ఊపిరితిత్తుల పనితీరు తగ్గిపోయినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఇది రెట్టింపు శాతం. ఈ కాలుష్య కణాలు మన శ్వాసనాళాల్లోకి వెళ్లి వాపు (inflammation), నొప్పులను కలిగిస్తాయి. దీనివల్ల ఊపిరితిత్తుల ద్వారా గాలి పీల్చుకునే సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది.
ఈ దీర్ఘకాలిక కాలుష్యం వల్ల క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, లంగ్ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు, గుండె జబ్బులు, స్ట్రోక్, మైగ్రేన్, మెదడు సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల అకాల మరణాలకు వాయు కాలుష్యం ఒక ప్రధాన కారణం అవుతుందంటేనే దీని సీరియస్‌నెస్ అర్ధం చేసుకోవచ్చు.
ఢిల్లీలో ఒక సంవత్సరం పాటు నివసిస్తే, అధిక కాలుష్య వాతావరణంలో ప్రతిరోజూ శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు క్రమంగా క్షీణిస్తుంది. లంగ్ ఫంక్షన్ టెస్టుల ప్రకారం, ఊపిరి తీసుకునే సామర్థ్యం సగం లేదా అంతకంటే ఎక్కువగా తగ్గవచ్చని తెలుస్తోంది.

ఈ కాలుష్యం (Pollution) ఊపిరితిత్తులలో వాపును పెంచి, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీని వల్ల తరచుగా దగ్గు, కఫం, శ్వాసకోశ సమస్యలు మొదలవుతాయి. అలసట, గొంతు నొప్పి, మరియు ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరిలో బ్రాంకైటిస్ లేదా ఆస్తమా వంటి సమస్యలు మరింత తీవ్రం కావచ్చు.
ఈ ప్రతికూల ప్రభావాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు N95 మాస్క్‌లు వాడటం చాలా ముఖ్యం. ఇంటి లోపల గాలిని శుభ్రంగా ఉంచుకోవాలి . అలాగే వీలైనంత వరకు బయటి కార్యకలాపాలను తగ్గించుకోవాలి. పోషకాహారం, వ్యాయామం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.

ఊపిరిలో సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. ఈ సమస్య చిన్నారులు, వృద్ధులు మరియు ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పిల్లల ఊపిరితిత్తుల అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు N95 మాస్క్‌లు వాడటం, ఇంటి లోపల గాలిని శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే, ప్రభుత్వాలు వాహనాల ఉద్గారాలను నియంత్రించాలి మరియు కాలుష్య నివారణ చర్యలను తీవ్రంగా అమలు చేయాలి.