Aadhaar card
రోజువారీ జీవితంలో ఆధార్ కార్డు (Aadhaar card)వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం , యూఐడీఏఐ (UIDAI) కీలక మార్పులు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, సొసైటీల వంటి ప్రైవేట్ సంస్థల్లో వ్యక్తుల గుర్తింపును పకడ్బందీగా ధ్రువీకరించే లక్ష్యంతో ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ విధానాన్ని త్వరలో అమలు చేయనున్నారు.
కేంద్రం తీసుకొస్తున్న ఈ నూతన విధానం యొక్క ముఖ్య లక్ష్యం గుర్తింపును పటిష్టం చేయడం మరియు వ్యక్తిగత వివరాల దుర్వినియోగాన్ని నివారించడం.
కొత్త యాప్ మరియు వెరిఫికేషన్.. UIDAI త్వరలో ఒక కొత్త యాప్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ యాప్ ద్వారా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే, ధ్రువీకరణ కోసం UIDAI సర్వర్‌లకు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు.
‘ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్’ (Proof of Presence).. ఈ సరికొత్త సాంకేతికతను ఉపయోగించి, కేవలం ముఖాన్ని స్కాన్ చేసి ఆ వ్యక్తిని ధ్రువీకరిస్తారు. ఇది ఆ వ్యక్తి ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఉన్నట్లు నిర్ధారిస్తుంది.
ఆధార్ కార్డులో (Aadhaar card)మార్పు.. వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు, ఆధార్ కార్డుపై పూర్తి వివరాలు లేకుండా కేవలం క్యూఆర్ కోడ్ , ఫొటో మాత్రమే ఉండేలా మార్పు తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఎంట్రీకి యాక్సెస్.. ఈ విధానం అమల్లోకి వస్తే, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జ్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసులు, ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాలు, సినిమా హాళ్లు, స్టేడియాలు, కచేరీలు వంటి అనేక ప్రైవేట్ , బహిరంగ ప్రదేశాలలో ఆధార్ యాక్సెస్‌తోనే ఎంట్రీ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ చివరి దశలో ఉంది.
ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయడంలో ప్రధానంగా భద్రత, పారదర్శకత , నేరాల నివారణ వంటి లక్ష్యాలు ఉన్నాయి.హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాలలో వ్యక్తుల గుర్తింపు పకడ్బందీగా నిర్ధారించడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు, అక్రమ కార్యకలాపాలు , ఇతర భద్రతాపరమైన సమస్యలను నివారించొచ్చు.
జిరాక్స్ కాపీలు లేదా నకిలీ ఐడీలను ఉపయోగించి వ్యక్తిగత వివరాలను దుర్వినియోగం చేయడం లేదా మోసాలకు పాల్పడటం ఆగిపోతుంది. ‘ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్’ సాంకేతికత నిజమైన వ్యక్తి ఉనికిని నిర్ధారిస్తుంది. గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసులు వంటి చోట్ల ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేదానిపై స్పష్టమైన రికార్డు ఉంటుంది. దీని ద్వారా నేరాలు జరిగినప్పుడు దర్యాప్తు సులభతరం అవుతుంది.
ప్రభుత్వ సేవలు కాకుండా, ప్రైవేట్ సంస్థల్లోనూ ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా వినియోగదారులకు వేగంగా, సులభంగా సేవలు అందించడానికి వీలవుతుంది.
అయితే ప్రజల నుంచి ఈ కొత్త విధానంపై ప్రైవసీ ఆందోళనలు (Privacy Concerns), అసహనం వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అన్నిచోట్లా ఆధార్ వివరాలను అందించడం వల్ల తమ వ్యక్తిగత జీవితంపై ప్రభుత్వం నిఘా పెడుతుందని, తమ కార్యకలాపాలు ట్రాక్ చేయబడతాయని కొంతమంది భావించే అవకాశం ఉంది.
ప్రతి చోటా ఆధార్(Aadhaar card) తప్పనిసరి చేయడం అనేది పౌరుల స్వేచ్ఛను అడ్డుకుంటుంది. ప్రభుత్వ నియంత్రణను పెంచుతుంది అనే విమర్శలు రావొచ్చు. అయితే, ఈ కొత్త విధానం ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ద్వారా UIDAI సర్వర్‌లకు కనెక్ట్ అవ్వకుండా వ్యక్తిగత వివరాలను భద్రపరుస్తుంది . కార్డుపై కేవలం క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంచుతుంది. ఈ చర్యలు కొంతవరకు ప్రజల ఆందోళనలను తగ్గించొచ్చు.
