Atal Canteen
ఆకలి అనేది ఏ దేశానికైనా, ఏ నగరానికైనా అతిపెద్ద సమస్య. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ వంటి మహానగరాల్లో రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అల్పాదాయ వర్గాల వారు ఒక పూట భోజనం చేయాలంటేనే తమ సంపాదనలో సగం వెచ్చించాల్సి వస్తోంది. రెస్టారెంట్లలో ఒక సాదా భోజనం ధర వంద రూపాయల పైమాటే ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా రాజధానిలో ‘అటల్ క్యాంటీన్ల(Atal Canteen)ను’ ప్రారంభించింది. కేవలం రూ. 5 కే నాణ్యమైన, రుచికరమైన శాకాహార భోజనాన్ని అందించడం దీని ముఖ్య ఉద్దేశం.
దేశంలో పేదల కోసం అతి తక్కువ ధరకే భోజనం అందించే ఈ క్యాంటీన్ల సంస్కృతికి ఆద్యురాలు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత. ఆమె ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో అన్నా క్యాంటీన్లు, కర్ణాటకలో ఇందిర క్యాంటీన్లు మొదలయ్యాయి. ఇప్పుడు అదే కోవలో ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు(Atal Canteen) రూపుదిద్దుకున్నాయి. లజ్‌పత్ నగర్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ..ఢిల్లీ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి కష్టపడే శ్రమజీవులకు ప్రభుత్వం ఇచ్చే చిరు కానుక ఇది అని అభివర్ణించారు.
నేటి కాలంలో రూ 5 కు కనీసం ఒక టీ కూడా దొరకని పరిస్థితి. కానీ ఈ అటల్ క్యాంటీన్ల(Atal Canteen)లో 5 రూపాయలకే పప్పు, అన్నం, చపాతీ, కూర , ఆవకాయతో కూడిన పరిపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. మొదటి విడతగా ఢిల్లీలోని ఆర్కే పురం, రాజౌరీ గార్డెన్, షాలీమార్ బాగ్, నరేలా వంటి కీలక ప్రాంతాల్లో 45 క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చారు.
రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను 100 కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి క్యాంటీన్‌లో రోజుకు సుమారు 500 మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు లంచ్, మళ్లీ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు డిన్నర్ లభిస్తుంది. అంటే రోజుకు రెండు పూటలా పేదలకు ఆహార భద్రత కల్పించడమే ఈ పథకం లక్ష్యం.
సాధారణంగా ఇలాంటి ప్రజా క్షేమ పథకాల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం, ఈసారి పారదర్శకతకు పెద్దపీట వేసింది. పాతకాలపు మాన్యువల్ కూపన్ల విధానానికి స్వస్తి పలికి ‘డిజిటల్ టోకెన్’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీనివల్ల భోజనం పంపిణీలో లెక్కలు తారుమారు కాకుండా ఉంటాయి. అలాగే ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ (DUSIB) ఆధ్వర్యంలో అన్ని క్యాంటీన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఈ కెమెరాల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి అధికారులు రియల్ టైమ్‌లో క్యాంటీన్ల పనితీరును, భోజనం నాణ్యతను పర్యవేక్షిస్తారు. ఆకలితో ఎవరూ నిద్రపోకూడని నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దడానికి ఈ అటల్ క్యాంటీన్లు(Atal Canteen) ఆ నగరానికి ‘ఆత్మ’గా నిలవనున్నాయి.
కార్మికులకు, పేద విద్యార్థులకు , అల్పాదాయ వర్గాలకు ఈ క్యాంటీన్లు ఒక వరం వంటివి. తమ కష్టార్జితంలో భోజనం కోసం పెట్టే ఖర్చు తగ్గుతుంది కాబట్టి, ఆ డబ్బును తమ పిల్లల చదువులకో లేదా ఇతర అవసరాలకో వాడుకునే అవకాశం కలుగుతుంది. ఢిల్లీ ప్రభుత్వంలోని ఈ నిర్ణయం ఇతర మెట్రో నగరాలకు కూడా ఆదర్శంగా నిలవనుంది.
