Donald Trump
అమెరికాకు రెండో సారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)అన్ని విధాలుగా పూర్తిగా విరద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పటి మిత్ర దేశాలతో ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనం. అదే సమయంలో అప్పుడు పెద్దగా పట్టించుకోకుండా, విమర్శలు గుప్పించిన పాకిస్తాన్‌కు ట్రంప్ ఇప్పుడు దగ్గరవుతున్నారు.
దాదాపు ప్రతీ విషయంలోనూ పాక్‌కు అండగా నిలుస్తున్నారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ట్రంప్ ఎందుకు మద్ధతు పలుకుతున్నారో అర్థం కావడం లేదు. ఆ దేశ సైనిక చీఫ్ తో తరచూ మంతనాలు సాగిస్తూ, పాక్ ప్రధానితో భేటీలు నిర్వహిస్తూ దాయాది దేశానికి తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఆర్థికంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న పాక్‌కు రుణాలు మంజూరు చేయించడంలో ట్రంప్ దే కీలక పాత్ర. పైగా అక్కడ పెట్టబడులు పెట్టేందుకు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తొలిసారి ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పుడు పాక్ ను ఉతికారేసిన ట్రంప్(Donald Trump).. ఇప్పుడు రెండోసారి మాత్రం బాగానే ప్లేటు ఫిరాయించేశారు. భారత్ పట్ల సంకుచిత ధోరణతో వ్యవహరిస్తూ, టారిఫ్‌లు, ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ పాకిస్థాన్‌తో మాత్రం బాగానే జట్టు కడుతున్నారు. దీనిలో భాగంగా పాక్ కు ఓ ఆఫర్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. తమ లోకోమోటివ్ రైళ్లను దాయాదికి విక్రయించబోతోంది.
అలాగే పాక్ లో ఉన్న అరుదైన ఖనిజాల వెలికితీతకు కూడా సహాయం చేయడానికి అగ్రరాజ్యం ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన పాక్ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఔరంగజేబు అమెరికా పర్యటన జరిపినప్పుడు చర్చలు మొదలయ్యాయి. అలాగే ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ లైసెన్స్ అనుమతులను కూడా సానుకూలంగా పరిశీలించాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా అమెరికా సంస్థలపై పాకిస్థాన్ 5 శాతం డిజిటల్ పన్నును రద్దుచేసింది.
ఇదిలా ఉంటే ఖనిజ రంగంలో భారీ పెట్టుబడులకు అమెరికా సిద్ధమైంది. దాదాపు 135 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టేందుకు అంగీకరించింది. దీనిలో భాగంగానే పాక్ కు చెందిన మైనింగ్ కంపెనీకి 1.25 బిలియన్ డాలర్ల రుణాన్ని కూడా మంజూరు చేయించింది. ఈ సమయంలోనే అక్కడ మైనింగ్ తవ్వకాలు, ఖనిజాభివృద్ధి పనులలో రెండు దేశాలూ కలిసి పనిచేయనున్నాయి. ఇప్పటికే అమెరికాకు అరుదైన ఖనిజాలను ఎగుమతి చేస్తున్నందుకు సొంతదేశంలోనే పాక్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.
