Alcohol
మద్యం(Alcohol) తాగితే ఆరోగ్యం పాడయిపోతుందన్న విషయం తెలిసినా అదే వ్యసనంగా మార్చుకుంటున్నారు. దీనికి చెక్ పెట్టాల్సిన ప్రభుత్వాలు కూడా లిక్కర్ సేల్ ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచే పొజిషన్‌లో మద్యం అమ్మకాలు ఉండటంతో.. దీనివైపే మొగ్గుచూపిస్తున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం దీనిపై తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగుతోంది.
మద్యం (Alcohol) షాపుల ముందు భారీ క్యూలు, ట్రాఫిక్ జామ్‌లు, గందరగోళ పరిస్థితులకు చెక్ పెట్టాలని కేరళ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి పరిష్కారంగా రాష్ట్రానికి చెందిన బేవరేజెస్ కార్పొరేషన్ (BEVCO) ఒక సూపర్ ప్రతిపాదన చేసింది.మద్యం ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికే డెలివరీ చేసే సదుపాయం కల్పించడానికి వేగంగా కసరత్తులు చేస్తోంది. .
ఇకపై ఇంట్లో రిలాక్స్‌గా కూర్చుని ఫోన్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. BEVCO ఈ కొత్త విధానం కోసం ఇప్పటికే ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా సిద్ధం చేసింది. అంతేకాదు, స్విగ్గీ, జొమాటో వంటి పెద్ద డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం, మద్యం కావాల్సిన వారు కనీసం 23 సంవత్సరాల వయస్సు ఉన్నవారై ఉండాలి. డెలివరీ సమయంలో తప్పనిసరిగా గుర్తింపు పత్రం చూపించాల్సి ఉంటుంది.
ఈ విధానం వల్ల లిక్కర్(alcohol) షాపుల దగ్గర రద్దీ తగ్గుతుంది, కస్టమర్లకు సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం కూడా వస్తుందని BEVCO ఆశిస్తోంది. అయితే, ప్రభుత్వం ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇది రాజకీయంగా, సామాజికంగా చాలా సున్నితమైన అంశం.
దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉండటంతో విమర్శలూ ఎక్కువే వినిపిస్తున్నాయి. కేరళలో ఈ ప్రతిపాదన రాగానే, దీనిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. మద్యం వినియోగాన్ని నియంత్రించాలని దశాబ్దాలుగా సామాజిక ఆరోగ్య సంస్థలు చెబుతున్నప్పటికీ, ఇంటి వద్దకే డెలివరీ చేయడం వల్ల యువతలో, ముఖ్యంగా అండర్-ఏజ్ వర్గాల్లో వినియోగం పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి.ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఇప్పటికే అధికారికంగా ఆన్‌లైన్ మద్యం డెలివరీని అనుమతిస్తున్నాయి.ఢిల్లీలో షాపుల వద్ద క్యూలను తగ్గించడానికి వర్చువల్ టోకెన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు.
కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలు స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న పానీయాల డెలివరీపై పైలట్ ప్రాజెక్టులు చేస్తున్నాయి.
మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం వంటి రాష్ట్రాలు కరోనా సమయంలో తాత్కాలికంగా అనుమతించి, ఇప్పుడు రద్దు చేశాయి. అయితే, కొన్ని స్థానిక సంస్థలు మాత్రం ఈ సేవలను కొనసాగిస్తున్నాయి.
మద్యాన్ని (Alcohol) ఇంటి వద్దకే చేర్చడం వల్ల వినియోగం పెరుగుతుందని, అది సామాజిక, ఆరోగ్య పరంగా తీవ్ర ప్రభావాలను చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, ఈ విధానాన్ని అమలు చేయాలంటే… వయస్సు నిర్ధారణ, కఠిన నియంత్రణలు, సరైన ట్రాకింగ్, సామాజిక అవగాహన కార్యక్రమాలు వంటివి తప్పనిసరి. కేరళ ప్రభుత్వం ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాలు తమ రాష్ట్ర ఆదాయంతో పాటు ప్రజల ఆరోగ్యం, భద్రతకు మధ్య సమన్వయం సాధించడమే తక్షణ ఆవశ్యకత అని గుర్తించాలి.