Zoho employee
చదువుతో సంబంధం లేకుండా, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అస్సాంకు చెందిన యువకుడు అబ్దుల్ అలీమ్ నిరూపించాడు. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన అలీమ్, ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా జీవితాన్ని ప్రారంభించి, తన స్వయంకృషితో అదే కంపెనీ(Zoho employee)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
అలీమ్ 2013లో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘జోహో(Zoho employee)’లో సెక్యూరిటీ గార్డ్‌గా చేరాడు. తన విద్యార్హతలను అడ్డంకిగా భావించకుండా, టెక్నాలజీపై ఉన్న ఆసక్తితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి శ్రీకారం చుట్టాడు. విధుల్లో లేనప్పుడు దొరికిన ఖాళీ సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా, ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంపై పూర్తి దృష్టి పెట్టాడు. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్, పుస్తకాలు , తన సొంత ప్రయత్నంతో కోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు.
అలీమ్ పట్టుదల, నేర్చుకోవాలన్న తపనను గమనించిన కంపెనీలోని సహోద్యోగులు, ఉన్నతాధికారులు అతడిని ఎంతగానో ప్రోత్సహించారు. వారి మద్దతుతో, ఎనిమిదేళ్ల పాటు పడిన కష్టం ఫలించింది. చివరకు, అతను సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న అదే ‘జోహో’ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించి తన కలను సాకారం చేసుకున్నాడు.
2021లో తన ఈ అద్భుతమైన ప్రయాణాన్ని వివరిస్తూ అలీమ్ లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. సెక్యూరిటీ గార్డ్‌గా మొదలై, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారిన తన ఎనిమిదేళ్ల కథ ఎంతోమందిని స్ఫూర్తిని ఇచ్చింది. సరైన విద్యా నేపథ్యం లేకపోయినా, స్వయంకృషితో , అంకితభావంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయోచ్చని అబ్దుల్ అలీమ్ నిరూపించాడు. ప్రస్తుతం అతను జోహో కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ , క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు.