Garuda Purana
హిందూ మతంలోని అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం (Garuda Purana )ఒకటిగా పండితులు చెబుతారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునికి జీవన్మరణాల రహస్యాలను ఉపదేశించిన గ్రంథమని అంటారు. అయితే, గరుడ పురాణం గురించి ప్రజల్లో చాలా భయాలు , అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైనా మరణించినప్పుడే ఈ పురాణం చదవాలని.. మామూలు సమయాల్లో ఇంట్లో ఉంచుకోకూడదని చాలా మంది అనుకుంటారు.
గరుడ పురాణం (Garuda Purana ) ఇంట్లో ఉంటే అమంగళం జరుగుతుందని, అరిష్టం అని ప్రచారం కూడా ఉంది. కానీ నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే అని పండితులు చెబుతున్నారు. ఏ పురాణమైనా దేవుడి వాక్కు కాబట్టి అది ఎప్పుడూ శుభప్రదమే అవుతుందని పండితులు అంటున్నారు.
గరుడ పురాణం(Garuda Purana )లో మూడు భాగాలు ఉంటాయి. అవి..ఆచార కాండ, ప్రేత కాండ , బ్రహ్మ కాండ. దీనిలో ప్రేత కాండలో మాత్రమే మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, నరక బాధలు, పిండ ప్రదానాల గురించి ఉంటుంది. అందుకే దీనిని ఎవరైనా చనిపోయినప్పుడు పారాయణం చేస్తారు. కానీ మిగిలిన రెండు భాగాలలో ధర్మం, నీతి, ఆరోగ్యం, ఆయుర్వేదం , మోక్షం గురించి అద్భుతమైన ఎన్నో విషయాలు ఉంటాయి.
గరుడ పురాణం చదవడం వల్ల నిజానికి మనిషికి పాపభీతి కలుగుతుంది. తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలియడం వల్ల ఆ మనిషి సన్మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాడు. ఇతరులకు అన్యాయం చేయకూడదనే స్పృహను ఈ గ్రంథం కలిగిస్తుంది. కాబట్టి గరుడ పురాణం భయం కలిగించే గ్రంథం కాదు, ఒక క్రమశిక్షణను నేర్పే గ్రంథం అని అందరూ తెలుసుకోవాలి.
గరుడ పురాణం (Garuda Purana)ఇంట్లో ఉంచుకోవచ్చు అలాగే పవిత్రమైన మనసుతో ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఏ గ్రంథమైనా అందులోని జ్ఞానాన్ని తెలుసుకోవడానికే రాశారు కానీ, భయపడటానికి కాదు. అంతేకాదు గరుడ పురాణం చదవడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని కూడా చెబుతారు. అయితే, ఏ పూజ చేసినా లేదా పురాణం చదివినా భక్తిశ్రద్ధలతో చేయడం ముఖ్యం.
అందులోని నీతిని గ్రహించి జీవితంలో ఆచరిస్తే, జీవించి ఉన్నప్పుడే మోక్షానికి మార్గం సుగమం అవుతుంది. మరణం అనేది జీవితంలో ఒక అంతర్భాగం అని, అది అంతం కాదని తెలియజేయడమే ఈ గరుడ పురాణం ఉద్దేశ్యం. కాబట్టి అపోహలను పక్కన పెట్టి, సత్యమైన జ్ఞానాన్ని అందించే గరుడ పురాణాన్ని
ఇంట్లో ఉంచుకుని పఠనం చేసుకోవచ్చు.
APSRTC:ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే రూ.27.68 కోట్ల ఆదాయం..
