Ganesh Uike
దట్టమైన అడవులు, కొండలు కోనల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ఎర్రజెండా పోరాటం ఇప్పుడు తన ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన తాజా ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు గట్టి షాక్ ఇచ్చింది.
ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా, అందులో కోటి రూపాయలకు పైగా రివార్డు ఉన్న అగ్రనేత గణేశ్ ఉయికే (Ganesh Uike)హతం కావడం సంచలనంగా మారింది. అతడితో పాటు ఒక మహిళా మావోయిస్టు కూడా మరణించింది. ఘటనా స్థలంలో అత్యాధునిక ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
హిడ్మా వంటివారు ఎన్‌కౌంటర్లలో మరణించడంతో మావోయిస్టు కేడర్ పూర్తిగా బలహీనపడింది. ఇప్పుడు గణేశ్ ఉయికే (Ganesh Uike)హతం కావడం భద్రతా దళాల అతిపెద్ద విజయంగా చెప్పొచ్చు. గణేశ్ ఉయికే(Ganesh Uike) ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించేవాడు. కీలక నాయకత్వం ఒక్కొక్కటిగా కనుమరుగవుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో మరణ భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్లుగా మావోయిజం రహిత భారత్ లక్ష్యం వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి.
ఒకవైపు భద్రతా దళాల తుపాకీ తూటాలకు అగ్రనేతలు నేలకొరుగుతుంటే, మరోవైపు ప్రభుత్వ హామీలతో చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. హింస ద్వారా సాధించేది ఏమీ లేదని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం ఇస్తున్న పిలుపు మావోయిస్టు కేడర్ పై గట్టి ప్రభావం చూపుతోంది. కొన్ని నెలలుగా వందల సంఖ్యలో సాయుధ దళాల సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మరణ భయంతో కొందరు, మెరుగైన జీవితం కోసం మరికొందరు అడవిని వదిలి వస్తున్నారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కగార్’ వంటి వ్యూహాలు మావోయిస్టులను ఇరకాటంలో పడేశాయి. అడవిలో మౌలిక సదుపాయాలు పెంచడం, కొత్త పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయడం, మరియు ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం వల్ల మావోయిస్టుల సంచారం పరిమితమైంది.
తాజాగా జరిగిన కందమాల్ ఎన్‌కౌంటర్ తరువాత ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. నాయకత్వ లేమి, ఆర్థిక వనరుల కొరత, స్థానిక ప్రజల మద్దతు తగ్గడం మావోయిస్టు ఉద్యమాన్ని అంతిమ దశకు చేరుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే దండకారణ్యంలో తుపాకీ శబ్దాలకు బదులు అభివృద్ధి మంత్రం వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
