heart-touching incident:మానవత్వం, ధైర్యం, నిస్వార్థ సేవ.. ఈ మూడు గుణాలు ఒక చోట కలిసినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలియజేసే సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్(Railway Stion)లో తాజాగా చోటుచేసుకుంది. అకస్మాత్తుగా పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఒక యువ ఆర్మీ వైద్యుడు సమయస్ఫూర్తితో, అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించుకుని సురక్షితంగా ప్రసవం చేసి ప్రాణాలు నిలబెట్టారు.
heart-touching incident
పన్వేల్ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళుతున్న రైలులో ఉన్న ఒక గర్భిణికి ప్రయాణంలోనే పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో ఆమెను అత్యవసర వైద్య సహాయం కోసం ఝాన్సీ స్టేషన్‌లో దించారు. అదే సమయంలో, హైదరాబాద్‌కు వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న మేజర్ డాక్టర్ రోహిత్ బచ్వాలా (31) అనే ఆర్మీ వైద్యాధికారి(ArmyDoctor) పరిస్థితిని గమనించారు. ఆ మారుమూల రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఆమె పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయారు.
తక్షణం రంగంలోకి దిగిన డాక్టర్ రోహిత్ బచ్వాలా ( Dr. Rohit Bachwala) తనకున్న వైద్య పరిజ్ఞానాన్ని, అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. అక్కడ అందుబాటులో ఉన్న రైల్వే మహిళా సిబ్బంది, కొందరు స్థానిక మహిళల సహాయం తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సర్జరీ పరికరాలు లేకపోయినా, తన జేబులోని పాకెట్ కత్తిని, ఒక హెయిర్ క్లిప్పును వాడుకున్నారు. శస్త్రచికిత్సా నిపుణుడు తన క్లినికల్ రూంలో చేసినంత నిశ్శబ్దంగా, అద్భుతంగా ఆ ప్లాట్‌ఫామ్‌పైనే ప్రసవం చేశారు.
డాక్టర్ రోహిత్ వివరించిన దాని ప్రకారం, పండంటి ఆడబిడ్డ పుట్టగానే, బొడ్డుతాడును బిగించడానికి ఒక హెయిర్ క్లిప్పును ఉపయోగించారు. బిడ్డ ఆరోగ్యం స్థిరంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత, తన పాకెట్ కత్తితో జాగ్రత్తగా బొడ్డుతాడును కత్తిరించారు. ఒక తల్లికి పునర్జన్మ, ఒక పసి ప్రాణానికి ప్రాణం పోసిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది, ఆనందభాష్పాలను రాల్చింది.
ఈ సంఘటన “అవసరం లో ఆదుకోవాలన్న స్పృహ ఉండాలే కానీ అన్ని అలా కలిసొస్తాయి” అన్న నానుడిని మరోసారి నిజం చేసింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవడంతో ఇలాంటి ధర్మాత్ములు ఉన్నందువల్లే ఈ భూమి ఇంకా సురక్షితంగా, ఆశాజనకంగా ఉందేమోనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మేజర్ డాక్టర్ రోహిత్ బచ్వాలా చూపిన మానవత్వం, అంకితభావం ఎందరికో ఆదర్శం, స్ఫూర్తిదాయకమని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆయన చేసిన ఈ పని కేవలం ఒక వైద్య సేవ మాత్రమే కాదు, సాటి మనిషి పట్ల ఉన్న ప్రేమ, బాధ్యతకు నిదర్శనం అంటూ అక్కడి వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.