Sunita Williams :రోదసి వీరనారి సునీతా విలియమ్స్ అద్భుత ప్రస్థానం.. 27 ఏళ్ల నాసా కెరీర్.. ఎన్నో రికార్డులు..

Sunita Williams : అంతరిక్షం నా ప్రియమైన ప్రదేశం. నాసాలో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక పాఠం అని సునీతా విలియమ్స్ తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నారు.

Sunita Williams

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams)..తాజాగా తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలుకుతూ నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతరిక్షం నా ప్రియమైన ప్రదేశం. నాసాలో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక పాఠం అని ఆమె తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నారు.

1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఒహియోలో జన్మించిన సునీత, తన తండ్రి దీపక్ పాండ్యా ద్వారా భారతీయ మూలాలను, తల్లి బోనీ పాండ్యా ద్వారా స్లోవేనియన్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు.

ఆమె తండ్రి గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఝులాసన్ గ్రామం నుంచి అమెరికాకు వలస వెళ్లిన ప్రముఖ న్యూరో అనాటమిస్ట్. సునీత తన చిన్నతనంలోనే సైన్స్ , అన్వేషణ పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచేవారు. ఆమె విద్యాభ్యాసం అంతా క్రమశిక్షణతో కూడిన వాతావరణంలోనే సాగింది.

1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి పట్టా పొందిన తర్వాత, ఆమె అమెరికా నావికాదళంలో హెలికాప్టర్ పైలట్‌గా చేరారు. నేవీలో ఉన్న సమయంలో సునీత సుమారు 30 రకాల విమానాలను 3,000 గంటల పాటు నడిపిన అపారమైన అనుభవాన్ని సంపాదించారు. ఈ పట్టుదలే ఆమెను 1998లో నాసా వ్యోమగామి శిక్షణకు ఎంపికయ్యేలా చేసింది.

సునీత విలియమ్స్ తన కెరీర్‌లో మొత్తం మూడు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు. ఆమె తొలిసారిగా 2006లో స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా రోదసిలోకి అడుగుపెట్టారు. ఆ మొదటి మిషన్‌లోనే ఆమె 192 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి, అప్పట్లో ఒక మహిళా వ్యోమగామి సుదీర్ఘకాలం రోదసిలో గడిపిన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. అదే ప్రయాణంలో ఆమె నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు.

ఇక 2012లో రెండవసారి ప్రయాణించినప్పుడు ఆమె స్పేస్ స్టేషన్‌లో 127 రోజులు గడిపారు. ఈ రెండు మిషన్ల సమయంలోనే ఆమె తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు ఆమె తనతో పాటు భగవద్గీతను, గణేశుడి విగ్రహాన్ని, సమోసాలను తీసుకెళ్లి తన భారతీయతను చాటుకున్నారు.

కేవలం ప్రయోగాలు చేయడమే కాకుండా, అంతరిక్ష కేంద్రంలో ఉండగానే 2007లో జరిగిన బోస్టన్ మారథాన్‌లో ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తి, అంతరిక్షంలో మారథాన్ పూర్తి చేసిన తొలి వ్యక్తిగానూ రికార్డు చరిత్ర సృష్టించారు.

Sunita Williams

సునీత విలియమ్స్(Sunita Williams) కెరీర్‌లో 2024 జూన్‌లో చేపట్టిన థర్డ్ మిషన్ అత్యంత సవాలుతో కూడుకుంది అయిపోయింది. బోయింగ్ స్టార్ లైనర్ నౌకలో బుచ్ విల్మోర్‌తో కలిసి కేవలం ఎనిమిది రోజుల యాత్ర కోసం వెళ్లిన ఆమె, సాంకేతిక లోపాల వల్ల అక్కడే చిక్కుకుపోయారు. ఆ వారం రోజుల ప్రయాణం కాస్తా దాదాపు తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణగా మారింది.

అనారోగ్య సమస్యలు, పరిమిత వనరులు ఉన్నా కూడా సునీత ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా అంతరిక్ష కేంద్రంలో తన సేవలను కొనసాగించారు. చివరికి 2025 మార్చిలో ఆమె సురక్షితంగా భూమికి చేరుకున్నారు. తన మొత్తం కెరీర్‌లో తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేసి, మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు రోదసిలో నడిచిన మహిళగా ఆమె రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపారు, ఇది మానవ అంతరిక్ష యాత్ర చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది

సునీతా విలియమ్స్(Sunita Williams) రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ..నాసా అడ్మినిస్ట్రేటర్లు ఆమెను మానవ అంతరిక్ష యాత్రలో ఒక మార్గదర్శకురాలిగా అభివర్ణించారు. నిజానికి సునీత విలియమ్స్ సాధించిన విజయాలు కేవలం ఆమె వ్యక్తిగత రికార్డులు మాత్రమే కావు, అవి భవిష్యత్తులో చంద్రుడిపైకి , అంగారకుడిపైకి వెళ్లే తర్వాతి తరం వ్యోమగాములకు ఒక బలమైన పునాది వంటివి. అంతరిక్షం తనకెంతో ప్రియమైన స్థలమని, నాసాలో గడిపిన ప్రతి క్షణం తన జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు.

మొత్తంగా భారతీయ మూలాలున్న ఒక మహిళ.. ప్రపంచ స్థాయి సంస్థలో ఇంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం అనే చెప్పాలి. ఒక సాధారణ నేవీ పైలట్ నుంచి ప్రపంచం గర్వించే వ్యోమగామిగా ఎదిగిన ఆమె ప్రస్థానం ఎందరో యువతులకు, ముఖ్యంగా సైన్స్ రంగంలో రాణించాలనుకునే వారికి ఎప్పటికీ ఒక గొప్ప స్ఫూర్తిదాయక కథగా నిలిచిపోతుందన్నది నిజం.

Journey:ఇక హైదరాబాద్ టు అమరావతి ప్రయాణం కూల్.. కొత్త హైవేలతో తగ్గనున్న దూరం, సమయం..

 

Exit mobile version