Cloudbursts
పవిత్రతకు,ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే అద్భుతమైన ప్రాంతాలు..ఇప్పుడు విషాదానికి నిలయంగా మారుతున్నాయి. ఒక్క రోజులో కాదు, కేవలం కొన్ని వారాల వ్యవధిలో వరుసగా సంభవించిన క్లౌడ్‌బరస్ట్ (Cloudbursts)ఘటనలు ఈ సంవత్సరం మానవ జీవితానికి తీవ్రమైన సవాల్‌గా నిలిచాయి. ముఖ్యంగా జమ్మూ-కశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఈ ప్రకృతి ప్రకోపాలు పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలను బలిగొన్నాయి.
ఈ ఏడాదిలో అత్యంత దారుణమైన ఘటన ఆగస్టు 14న జమ్మూ-కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. మచైల్ మాతా యాత్ర మార్గంలో, చిసోటి గ్రామం వద్ద అకస్మాత్తుగా క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. యాత్ర కోసం సుమారు 1,200 మంది అక్కడ ఉన్న సమయంలో, భారీ వర్షంతో పాటు ఒక్కసారిగా నీరు, బురద వెల్లువలా వచ్చిపడింది. ఈ ఊహించని వరద ప్రవాహంలో వందల మంది యాత్రికులు, స్థానికులు చిక్కుకుపోయారు.
అధికారిక రికార్డుల ప్రకారం, ఈ దుర్ఘటనలో కనీసం 65 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా 200 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ ఘటనలో పలు ఇళ్లు, ఆలయాలు, వంతెనలు, వాహనాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. భారత ఆర్మీ, ఎస్‌డిఆర్‌ఎఫ్, స్థానిక వాలంటీర్లు సహాయక చర్యల్లో అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ, ధ్వంసమైన రహదారులు, వాతావరణం సహకరించకపోవడం వల్ల సహాయక బృందాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Also Read: Thirunama: శ్రీవారి నుదిటిపై ఉండే తిరునామం మూడు రకాలుగా ఎందుకుంటుంది?
కిష్త్వార్ ఘటనతో ఈ విషాదాల పరంపర ఆగలేదు. కొన్ని వారాల వ్యవధిలోనే హిమాలయ ప్రాంతాల్లో మరిన్ని క్లౌడ్‌బరస్ట్‌లు సంభవించాయి. ఆగస్టు 5న ఉత్తరాఖండ్(Uttarakhand)లోని ఉత్తర్ కాశీలో ఉన్న ధరాలి, సుఖీ టాప్ ప్రాంతాలు క్లౌడ్‌బర్స్ట్(Cloudbursts)తో అతలాకుతలమయ్యాయి. ఈ ఘటనలో కనీసం 5 మంది మరణించగా, 50 మంది గల్లంతయ్యారు. ఎన్నో హోటళ్లు, ఇళ్లు, మార్కెట్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వాతావరణం సహకరించక సహాయక చర్యలకు తీవ్ర జాప్యం జరిగింది.
కిష్త్వార్ ఘటన తర్వాత కేవలం మూడు రోజులకే, ఆగస్టు 17న కశ్మీర్‌లోని కాథువా జిల్లా, జోధ్ ఘాటి ప్రాంతంలో మరో క్లౌడ్‌బరస్ట్(cloudbursts) సంభవించింది. ఈ ఘటనలో కనీసం 7 మంది మరణించగా, అనేక మంది గల్లంతయ్యారు. లాండ్ స్లైడ్స్ వల్ల రహదారులు మూసుకుపోయాయి.
ఇదే సమయంలో లడఖ్, కార్గిల్ వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలతో పాటు క్లౌడ్‌బరస్ట్‌లు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాణ, ఆస్తి నష్టాలు నమోదయ్యాయి.
మరిన్ని నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2025లో చోటుచేసుకున్న ఈ వరుస ఘటనలు, హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల తీవ్రతను సూచిస్తున్నాయి. క్లౌడ్‌బర్స్ట్‌లు(Cloudbursts) అసాధారణం కాకపోయినా, ఒకే సంవత్సరంలో ఇంత పెద్ద సంఖ్యలో, ఇంతటి ప్రాణనష్టానికి కారణం కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ దుర్ఘటనల కారణంగా ప్రజలు, యాత్రికులు ప్రాణాలను కోల్పోవడమే కాకుండా, విద్యుత్, రవాణా, నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయాయి.
క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, సరిహద్దు ప్రాంతాలు కావడంతో సహాయక చర్యలు కూడా సకాలంలో అందడం లేదు.ఈ విపత్తులు ప్రకృతి మనకు ఇస్తున్న హెచ్చరికలా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను ఎదుర్కోవడానికి మరింత పటిష్టమైన ప్రణాళికలు అవసరం.