Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు..ఆ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్
Rains:రానున్న రోజుల్లో కూడా ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది

Rains
తెలంగాణలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ జిల్లాలలో సాధారణ జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. హైదరాబాద్, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ వంటి ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల(Rains)తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) ముందుగా జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు (Rains) కురిశాయి. కొన్ని ఉత్తర ప్రాంతాలు, మేడ్చల్, సైబరాబాద్ పరిసరాల్లో 10 నుంచి 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరం ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. గచ్చిబౌలి, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, అమీర్‌పేట్, లక్డీపూల్, దిల్‌సుఖ్‌నగర్, రాజ్ భవన్ రోడ్ వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. కార్లు, ఇతర వాహనాలు నీటిలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు , హైడ్రా( HYDRAA) అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. నీటిని తొలగించేందుకు, ట్రాఫిక్ సాధారణ స్థితికి తీసుకురావడానికి నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్‌తో పాటు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. GHMC పరిధిలోని స్కూళ్లకు హాఫ్ డే సెలవు మాత్రమే ప్రకటించినప్పటికీ, ఇతర జిల్లాల్లో పరిస్థితిని బట్టి పూర్తి సెలవులు ప్రకటించారు.
ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం సూచించింది. దీనివల్ల రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి, ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా, రహదారి భద్రతపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం,హైడ్రా అధికారులు, స్థానిక అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టి నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. డ్యామ్‌లు, చెరువుల నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వరద పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ వర్షాల(Rains) వల్ల విద్యార్థుల విద్యా కార్యకలాపాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రజలు తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు. ప్రభుత్వం తరపున హెచ్చరికలు జారీ చేస్తున్నా.. రానున్న రోజుల్లో కూడా ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు
Also Read: Children: వర్షాకాలంలో మీ పిల్లలకు చెప్పాల్సిన జాగ్రత్తలివే..