Human relationships
ఏ తల్లిదండ్రులైతే తమ జీవితాలను మన కోసం త్యాగం చేశారో, ఇప్పుడు అదే తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేస్తున్నాం. వారి ప్రేమ, అనుబంధాలు, పెంపకం… అన్నీ మర్చిపోయి, ‘నేను, నా కుటుంబం’ అన్న సంకుచిత మనస్తత్వంలో కూరుకుపోతున్నాం. ఈ వయసులో వారికి కావాల్సింది ఆస్తులు కాదు, కేవలం కాస్తంత ప్రేమ, అభిమానపు మాటలు మాత్రమే. కానీ, పంతాలు, పట్టింపులు, స్వార్థాలకు ఓటేస్తున్నాం. తాజాగా ముంబైలో ఒక వృద్ధురాలి ఘటన మరోసారి కనుమరుగవుతున్న మానవ సంబంధాలను(Human relationships )ప్రశ్నిస్తోంది.
ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలు 10 నెలల క్రితం మరణించిన విషాద ఘటన, మన ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న మానవ సంబంధాల సంక్షోభాన్ని(Human relationships )కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కొడుకు అమెరికా నుంచి ముంబై వచ్చి చూడగా.. తన తల్లి మృతదేహం అత్యంత దీనస్థితిలో ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఏడాదిగా కనీసం ఆ కొడుకు తన తల్లికి ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని చెప్పడంతో పోలీసులు అవాక్కవుతున్నారు. ఈ సంఘటన మానవతా విలువలు, కుటుంబ బంధాలు ఎంతలా బలహీనపడ్డాయో తెలియజేస్తుంది.
ఈ ఘటన ఒక్క ముంబైకే పరిమితం కాదు.. చాలామంది జీవితాలు ఉమ్మడి కుటుంబాల నుంచి ఒంటరి బతుకులకు మారిపోతున్నాయి . గతంలో, మన సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండేది.తాతయ్యలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులు, పిల్లలు..అందరూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఒకరి బాగోగులు మరొకరు చూసుకునేవారు. కానీ, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, పట్టణీకరణ, ఉద్యోగ అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి కారణాల వల్ల న్యూక్లియర్ కుటుంబాలు పెరిగాయి. దీనితో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు.
ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు దేశాన్ని కలచివేశాయి.2017 ముంబైలోని అంధేరిలో, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక కుమారుడు తన తల్లి ఆశా సాహానీ ఫ్లాట్‌కు ఏడాది తర్వాత వచ్చి చూస్తే, ఆమె అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.2025 అయోధ్య, లక్నోలో తమ వృద్ధ తల్లిని రోడ్డుపై వదిలివేసిన కుటుంబ సభ్యుల ఉదంతం ప్రజల్లో ఆగ్రహం కలిగించింది. అలాగే 2025 ఢిల్లీలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఒక వృద్ధ జంటను దొంగలు చంపిన ఘటన, వృద్ధుల ఒంటరితనం ఎంత ప్రమాదకరమో తెలియజేసింది.
అంతేకాదు 2024-25లో దేశవ్యాప్తంగా వృద్ధాశ్రమాలు విపరీతంగా పెరిగిపోయాయి. తమ తల్లిదండ్రులను వదిలివేసే సంఘటనలు ఎక్కువయ్యాయి. ఇది సమాజంలో మానవతా విలువలు(Human relationships )తగ్గిపోతున్నాయనడానికి ఒక స్పష్టమైన ఉదాహరణ.పరిశోధనల ప్రకారం, భారతదేశంలో దాదాపు 70% మంది వృద్ధులు ఒంటరిగా లేదా సరైన మద్దతు లేకుండా జీవిస్తున్నారు. వారిలో చాలామందికి మానసిక ఒత్తిడి, భయం, నిరాశ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
కుటుంబ విలువలు పునరుద్ధరించేలా.. పిల్లలకు చిన్నతనం నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమను నేర్పించాలి. ఎంత బిజీగా ఉన్నా, తమ తల్లిదండ్రులతో సమయం గడపడానికి, వారి బాగోగులు తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ముందు మనిషిగా మనం మారాలి. కుటుంబం అంటే కేవలం ఒక ఆర్థిక వ్యవస్థ కాదు, అది ఒక భావోద్వేగ బంధం అని గుర్తుంచుకోవాలి.