Aadhaar with PAN: ఆధార్‌తో పాన్ లింక్ చేయక్కర్లేదా? కేంద్రం ఇచ్చిన కొత్త గైడ్‌లైన్స్ ఇవే..

Aadhaar with PAN: మీరు కనుక మినహాయింపు వర్గంలో లేకపోతే మాత్రం రేపటిలోగా ( డిసెంబర్ 31) ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

Aadhaar with PAN

భారతదేశంలో ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డును ఆధార్ కార్డు(Aadhaar with PAN)తో అనుసంధానం చేసుకోవాల్సిందే. ఒకవేళ డెడ్ లైన్‌లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే పాన్ కార్డు పని చేయదు. దీనివల్ల బ్యాంకింగ్ లావాదేవీల నుంచి పన్ను రీఫండ్‌ల వరకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.

అయితే ఈ కఠినమైన కండిషన్ నుంచి తాజాగా కేంద్ర ప్రభుత్వం కొంతమందికి వెసులుబాటు కల్పించింది. దీంతో ఈ పాన్-ఆధార్(Aadhaar with PAN) లింకింగ్ నుంచి ఎవరికి మినహాయింపు ఉందో తెలుసుకుంటే.. దీనివల్ల అనవసరమైన ఆందోళన చెందాల్సిన పని ఉండదు. ముఖ్యంగా 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వృద్ధులకు, అంటే సూపర్ సీనియర్ సిటిజన్లకు ఈ నిబంధన నుంచి ప్రభుత్వం పూర్తి మినహాయింపు ఇచ్చింది. వారి వయస్సు వల్ల ఈ ప్రక్రియ నుంచి వారిని మినహాయించడం వారికి పెద్ద ఊరట అని చెప్పొచ్చు.

అలాగే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారతదేశంలో నివసించని వ్యక్తులకు, అంటే ఎన్ఆర్ఐ (NRI)లు కూడా ఈ రెండింటిని లింక్ చేయక్కర లేదు. భారతీయ పౌరసత్వం లేని విదేశీయులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఇక భౌగోళిక పరంగా చూస్తే అస్సాం, మేఘాలయ , జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో నివసించే వారికి ప్రస్తుతం ఈ నియమం నుంచి మినహాయింపు ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఇక మైనర్ల విషయానికి వస్తే 18 ఏళ్ల లోపు పిల్లలకు పాన్ కార్డు ఉన్నట్లయితే, వారికి 18 ఏళ్లు నిండే వరకు ఆధార్ తో లింక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ ఆ మైనర్ పేరు మీద ఆదాయం ఉండి, పన్ను కూడా చెల్లిస్తున్నట్లయితే మాత్రం అప్పుడు లింక్ చేయాలి. సాధారణంగా పిల్లల పాన్ కార్డులు వారి తల్లిదండ్రుల ఆధార్ కు అనుసంధానమై ఉంటాయి కాబట్టి దీనిపై పెద్దగా భయపడక్కరలేదు.

Aadhaar with PAN

ఇంకో విషయం ఏమిటంటే మరణించిన వ్యక్తుల పాన్ కార్డుల గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాల్సిన పని లేదు. వారి కుటుంబ సభ్యులు లేదా చట్టపరమైన వారసులు ఈ ప్రక్రియను పూర్తి చేయనక్కర్లేదు. అయితే భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే సదరు వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖకు సరెండర్ చేయడమే మంచిది.

ఇక జాయింట్ అకౌంట్లు ఉన్నవారు కూడా గమనించాల్సింది ఏంటంటే, బ్యాంకు ఖాతా ఉమ్మడిగా ఉన్నంత మాత్రాన మీకు మినహాయింపు ఉన్నట్లు కాదు. ఒకవేళ మీరు పైన పేర్కొన్న మినహాయింపు వర్గాల్లో లేకపోతే ఆ ఖాతాకు లింక్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ విడివిడిగా తమ పాన్ మరియు ఆధార్‌ను లింక్ చేసుకోవాల్సిందే.

ఒకవేళ మీరు ఈ మినహాయింపు వర్గాల్లో లేకపోయి, ఇప్పటికీ మీ పాన్ కార్డును(Aadhaar with PAN) లింక్ చేయకపోతే అది ‘ఇన్-ఆపరేటివ్’ అంటే పని చేయని స్థితికి వెళ్లిపోయింది. దీనివల్ల మీకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్(Income Tax Refund) నిలిచిపోతుంది. అంతేకాకుండా ఆ వాపసుపై రావాల్సిన వడ్డీని కూడా మీరు కోల్పోతారు. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఆదాయంపై కోత విధించే టీడీఎస్ (TDS) చాలా ఎక్కువ రేటుతో అంటే సుమారు 20 శాతం వరకు కోత పడుతుంది. కాబట్టి మీరు గనుక మినహాయింపు వర్గంలో లేకపోతే మాత్రం రేపటిలోగా ( డిసెంబర్ 31) ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version