ICICI Bank
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఇటీవల తన వినియోగదారుల ఆందోళనల ముందు తలవంచక తప్పలేదు. కొత్త కస్టమర్ల కోసం కనీస నిల్వ (Minimum Average Balance – MAB) నిబంధనలను భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో, బ్యాంక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సవరించిన నిబంధనలను ప్రకటించింది.
అసలు కథ ఏమిటంటే, 2025 ఆగస్టు 1 నుండి మెట్రో ప్రాంతాల్లో కనీస నిల్వను రూ. 10,000 నుంచి రూ.50,000కి పెంచుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఇది సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తించడంతో మధ్యతరగతి, సగటు వేతనజీవుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సామాజిక మాధ్యమాల్లో ఈ నిర్ణయంపై వచ్చిన విమర్శలు బ్యాంకుపై ఒత్తిడిని పెంచాయి.
ముఖ్యంగా, చాలామంది ప్రజలకు నెలవారీ ఆదాయం రూ.25,000 కంటే తక్కువ ఉన్నప్పుడు, రూ.50,000 అకౌంట్‌లో నిల్వ ఉంచడం అసాధ్యమని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు నిబంధనలను సడలిస్తుంటే, ఐసీఐసీఐ(ICICI Bank) లాంటి ప్రైవేట్ బ్యాంక్ ఇలా చేయడంపై విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read: Pollution: మీ ఊపిరితిత్తులు పీల్చుకునేది గాలి కాదు, విషం..షాకింగ్ రిపోర్ట్స్
అయితే, వినియోగదారుల నుంచి వచ్చిన ఈ తీవ్ర వ్యతిరేకత, సోషల్ మీడియాలో వ్యక్తమైన ఆందోళనలతో ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2025 ఆగస్టు 13న, బ్యాంక్ తన కనీస నిల్వ నిబంధనలను సవరిస్తూ కొత్త ప్రకటన చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం, మెట్రో/అర్బన్ ప్రాంతాల్లో కనీస నిల్వను రూ.15,000కి, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.7,500కి, గ్రామీణ ప్రాంతాల్లో రూ2,500కి తగ్గించింది. ఈ సవరించిన నిబంధనలు కూడా ఆగస్టు 1 తర్వాత కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే వారికి మాత్రమే వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
వినియోగదారుల ఆందోళనలు, సామాజిక మాధ్యమాల ఒత్తిడి వల్ల ఐసీఐసీఐ బ్యాంక్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తప్పనిసరి అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. మధ్యతరగతి కస్టమర్లకు సేవలను అందించడంలో బ్యాంక్ వెనుకడుగు వేస్తే, వారు సహజంగానే ప్రభుత్వ రంగ బ్యాంకుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మార్కెట్‌లో తన పట్టును కోల్పోకుండా, వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఐసీఐసీఐ బ్యాంక్ ఈ యూ-టర్న్ తీసుకోవాల్సి వచ్చింది.
భారీగా పెంచిన నిల్వలు వినియోగదారులపై అదనపు భారం మోపడంతో, బ్యాంక్ సేవలు మరింత ప్యూర్‌గా ఉండాలనే సంకల్పంతో ఈ సవరణలు తీసుకురావడం సమంజసమైన చర్యగా భావించవచ్చు. ఇది కేవలం ఒక ప్రకటన వెనక్కి తీసుకోవడం మాత్రమే కాదు, వినియోగదారుల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బ్యాంక్ తన వ్యాపార వ్యూహంలో మార్పును సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.