K-4 Missile : ఐఎన్ఎస్ అరిఘాత్ అమ్ములపొదిలోకి కే-4.. శత్రువులకు కంటిమీద కునుకు ఉండదు!

K-4 Missile: సాధారణంగా క్షిపణులను భూమి మీద నుంచి లేదా గాలి నుంచి ప్రయోగించినప్పుడు శత్రువులు గుర్తించే అవకాశం ఉంటుంది.

K-4 Missile

భారత రక్షణ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. బంగాళాఖాతంలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే-4 బాలిస్టిక్ క్షిపణిని (K-4 Missile)విజయవంతంగా ప్రయోగించి తన అజేయ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అతి కచ్చితంగా ఛేదించగల ఈ క్షిపణి ప్రయోగం భారత నౌకాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది.

ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఐఎన్ఎస్ అరిఘాత్ ఇప్పుడు ఒక తిరుగులేని ఆయుధంగా మారింది. అణుశక్తితో నడిచే ఈ జలాంతర్గామి సముద్రం అడుగున నెలల తరబడి నిశ్శబ్దంగా ఉంటూ శత్రువుల కంట పడకుండా దాడులు చేయగలదు.

ఐఎన్ఎస్ అరిఘాత్ ప్రత్యేకత ఏమిటంటే, శత్రు దేశాలు మనపై అణు దాడికి పాల్పడితే, సముద్ర గర్భం నుంచి ప్రతిదాడి (సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ) చేసే సామర్థ్యం దీనికి ఉంది. సాధారణంగా క్షిపణులను భూమి మీద నుంచి లేదా గాలి నుంచి ప్రయోగించినప్పుడు శత్రువులు గుర్తించే అవకాశం ఉంటుంది.

కానీ సముద్ర మట్టానికి లోపల ఉండే జలాంతర్గామి నుంచి క్షిపణిని ప్రయోగించినప్పుడు దాన్ని గుర్తించడం మరియు అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. గతంలో మన దగ్గర ఉన్న ఐఎన్ఎస్ అరిహంత్‌లో కేవలం 750 కిలోమీటర్ల పరిధి కలిగిన కే-15 క్షిపణులు ఉండేవి. కానీ ఇప్పుడు కే-4 (K-4 Missile)రాకతో మన బలం ఐదు రెట్లు పెరిగింది.

K-4 Missile

ఈ ప్రయోగంతో భారత్ తన ‘న్యూక్లియర్ ట్రయాడ్’ (భూమి, గాలి, నీరు మూడు మార్గాల నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే శక్తి) సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

అణు జలాంతర్గాములు సంప్రదాయ జలాంతర్గాముల కంటే చాలా సైలెంట్‌గా పనిచేస్తాయి. వీటిని సోనార్ పరికరాల ద్వారా కూడా గుర్తించడం కష్టం. భారత్ వద్ద ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ రెండు అణు జలాంతర్గాములు క్రియాశీలకంగా ఉన్నాయి. మూడవ జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ అరిధమాన్ ప్రస్తుతం సముద్ర పరీక్షల దశలో ఉంది.

చైనా, పాకిస్తాన్ వంటి సరిహద్దు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును అడ్డుకోవడానికి ఇదొక బలమైన హెచ్చరిక. సముద్ర గర్భంలో భారత్ ఒక రక్షణ కవచాన్ని నిర్మించుకుందని ఈ ప్రయోగం స్పష్టం చేసింది. దీర్ఘశ్రేణి అణు నిరోధకతలో జలాంతర్గామి ప్రయోగ క్షిపణులు మూలస్తంభంగా మారుతున్నాయి. భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన ఈ కే-4 క్షిపణి(K-4 Missile), భారత్‌ను ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన నిలబెట్టింది. శాంతిని కాపాడటానికి శక్తివంతమైన ఆయుధం అవసరం అనే సిద్ధాంతాన్ని భారత్ మరోసారి నిరూపించింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version