Mount Everest: ఎవరెస్ట్ పై మంచు తుపాను చిక్కుకుపోయిన 1000 మంది

Mount Everest: ఎవరెస్ట్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నేపాల్ లో ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

Mount Everest

మౌంట్ ఎవరెస్టు(Mount Everest)పై ప్రకృతి విలయతాండవం చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ మంచు తుపాను బీభత్సం సృష్టించింది. ఫలితంగా ఎవరెస్ట్ ను అధిరోహించే క్రమంలో దాదాపు 1000 మంది అక్కడ చిక్కుకుపోయారు. వీరంతా 16 వేల అడుగుల ఎత్తులో మంచుతుపానులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సహాయక బృందాలు వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాయి. గత రెండురోజులుగా మంచు తుపాను కొనసాగుతున్నా కూడా  ఆదివారం రాత్రి నుంచి తీవ్రస్థాయికి చేరుకుంది.

ఫలితంగా అక్కడి రోడ్లన్నీ పూర్తిగా మంచులో కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు మంచును తొలగించేందుకు శ్రమిస్తున్నాయి. సాధారణంగా ఎవరెస్ట్ కు వెళ్ళే దారి అంత సందర్శకులు, పర్వతారోహకులతో రోజూ రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం చైనాలో సెలవులు కావడం, ఇటు వీకెండ్ కావడంతో ఈ రద్దీ మరింతగా పెరిగింది. ఇదే సమయంలో మంచు తుపాను బీభత్సం సృష్టించడంతో వీరంతా అక్కడే చిక్కుకుపోయారు.

Mount Everest

ఇప్పటికే కొంత మంది హైపోథెర్మియా బారినపడినట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మంచు తుపాను ప్రభావంతో ప్రస్తుతం ఎవరెస్ట్(Mount Everest) పైకి వెళ్లేందుకు అనుమతులు తాత్కాలికంగా నిలిపివేశారు.ఇప్పటి వరకు సుమారు 350 మందిని రక్షించి దగ్గరలో ఉన్న క్యుడాంగ్ అనే ప్రాంతానికి తరలించినట్టు రెస్క్యూ బృందాలు తెలిపాయి. అలాగే తుపాను ప్రభావం భారీ ఎత్తున పేరుకున్న మంచును స్థానికుల సహాయంతో తొలగించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే గత మూడు దశాబ్దాలుగా అక్టోబర్ నెలలో ఇంతటి విపరీతమైన మంచు తుపాను వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదని అక్కడి టూరిస్టు గైడ్లు చెబుతున్నారు.

Mount Everest

ఈ పరిస్థితికి కారణాలు లేకపోలేదు. ఎవరెస్ట్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నేపాల్ లో ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా గత మూడు రోజుల్లో అక్కడ 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. చైనాలో కూడా భారీ వర్షాలతో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

లక్షన్నర మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు సకాలంలో తరలించడం భారీగా ప్రాణనష్టం తప్పింది. మరోవైపు నేపాల్ లో చోటు చేసుకున్న ఈ విపత్తుపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని, ఎటువంటి సహాయం కావాలన్నా అందించాలని మోదీ విదేశాంగ శాఖకు ఆదేశాలిచ్చారు. అటు భూటాన్ లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలకు సహాయం అందించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగినట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version