January
మరో వారం రోజుల్లో మనం 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి, సరికొత్త ఆశలతో 2026 నూతన సంవత్సరం(January)లోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరం లాగే, ఈ కొత్త ఏడాది కూడా మన ఆర్థిక , వ్యక్తిగత జీవితాల్లో కొన్ని కీలక మార్పులను తీసుకురాబోతోంది. జనవరి 1వ (January)తేదీ నుంచి అమల్లోకి రానున్న కొన్ని నిబంధనలు మన బ్యాంకింగ్ వ్యవహారాల నుంచి మనం వాడే సోషల్ మీడియా వరకు అన్నింటినీ ప్రభావితం చేస్తాయి. వీటి గురించి ప్రతి సామాన్యుడు ముందే తెలుసుకోవడం చాలా అవసరం, లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
మొదటి , అతి ముఖ్యమైన మార్పు బ్యాంకింగ్ రంగానికి సంబంధించింది. ఇప్పటి వరకు మన క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ రిపోర్ట్ అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి బ్యాంకుల ద్వారా అప్డేట్ చేయబడేది. కానీ ఆర్బీఐ (RBI) కొత్త మార్గదర్శకాల ప్రకారం, జనవరి 1 నుంచి ప్రతి వారం రోజులకు ఒకసారి బ్యాంకులు , ఫైనాన్స్ సంస్థలు మీ క్రెడిట్ సమాచారాన్ని అప్డేట్ చేయాలి.
దీనివల్ల లాభం ఏంటంటే, ఎవరైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారి తాజా ఆర్థిక పరిస్థితి బ్యాంకులకు వెంటనే తెలుస్తుంది. ఇది నిజాయితీగా ఇఎంఐలు కట్టే వారికి వరం కాగా, లోన్లు ఎగ్గొట్టే వారికి శాపం కానుంది. సిబిల్ స్కోర్ లో పారదర్శకత పెరగడం వల్ల సామాన్యులకు లోన్లు లభించే ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది.
రెండవ మార్పు మన డిజిటల్ భద్రతకు సంబంధించింది. దేశంలో సైబర్ నేరాలు మరియు ఫేక్ అకౌంట్ల బెడద విపరీతంగా పెరిగిపోయింది. దీనిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం వాట్సప్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ యాప్స్ వాడాలంటే ‘సిమ్ బైండింగ్’ ,వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరి.
అంటే, మీరు ఏ ఫోన్ లో అయితే సిమ్ కార్డు వాడుతున్నారో, అదే ఫోన్ లో మాత్రమే ఆ నంబర్ తో అకౌంట్ పనిచేస్తుంది. వేరే ఎవరో మీ నంబర్ తో వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేయడం ఇకపై సాధ్యం కాదు. జనవరి 1 నుండి ఈ వెరిఫికేషన్ ప్రక్రియను యాప్ సంస్థలు అమలు చేయబోతున్నాయి.
మూడవది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెద్ద అప్డేట్. 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం (8th Pay Commission) సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాలు పెరగడమే కాకుండా, కరువు భత్యం (DA) కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
అలాగే ప్రతినెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రకటిస్తుంటాయి. కొత్త ఏడాది కానుకగా వంట గ్యాస్ ధరలు తగ్గుతాయని సామాన్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని పాత నియమాలు కూడా మారొచ్చు. కాబట్టి కొత్త ఏడాదిని సంతోషంగా ప్రారంభించాలంటే ఈ మార్పులకు అనుగుణంగా మన ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
