Supreme court
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుండడానికి పోర్నోగ్రఫీ కూడా ఒక కారణంగా చాలా మంది భావిస్తుంటారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా పోర్న్ సైట్లు పెరిగిపోవడం, అశ్లీల వీడియోలకు హద్దే లేకుండా పోవడం వంటివి చూస్తూనే ఉన్నారు. వీటిని పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా ఇదే అంశానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం(Supreme court)లో పిటిషన్ దాఖలైంది.
పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలవగా… దీనిపై విచారణకు స్వీకరించే క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ పై తక్షణమే విచారణ జరిపేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం నేపాల్ లో జరిగిన ఆందోళనలు గుర్తు చేసింది. అక్కడ సోషల్ మీడియా, ఇతర సైట్లపై నిషేధం విధించినప్పుడు ఏం జరిగిందో చూసారు కదా అంటూ వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ ను నాలుగు వారాల తర్వాత విచారిస్తామని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.
పోర్న్ సైట్లు, అశ్లీల వీడియోల వీక్షణ బాగా పెరిగిపోయిందని, ముఖ్యంగా మైనర్లను ఈ విషయంలో నిరోధించేందుకు ఒక ప్రణాళిక సిద్దం చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషనర్ దీనిని దాఖలు చేశాడు. ఇది చాలా పెద్ద విషయంగా పేర్కొన్న పిటిషనర్ జాతీయస్థాయిలో విధివిధానాలు రూపకల్పన, యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అభ్యర్థించాడు. డిజిటిలైజేషన్ పేరుతో అందరికీ ఒక్క క్లిక్కుతో అన్నీ అందుబాటులోకి వచ్చేయడం ఈ పరిణామాలకు దారితీసిందని పేర్కొన్నాడు.
అయితే లక్షల సంఖ్యలో ఉన్న అశ్లీల వెబ్ సైట్లను, అశ్లీల వీడియోలను నిరోధించలేకపోతున్నట్టు ప్రభుత్వమే అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశాడు. కోవిడ్ సమయంలో స్కూల్ విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల కోసం ట్యాబ్ లు, ఫోన్లను వాడడం కూడా ఈ పరిస్థితికి కారణమైందన్నాడు. అశ్లీల సైట్లను పక్కాగా నియంత్రించే వ్యవస్థ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నాడు.
ముఖ్యంగా 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలను ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన డేటాను కూడా కోర్టులో సమర్పించాడు. చైల్డ్ పోర్నోగ్రఫీని కూడా నియంత్రించలేకపోతుండడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఇలాంటి సైట్లను బ్లాక్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందంటూ గుర్తు చేశాడు. అయితే ఇలాంటి పిటిషన్ ను హడావుడిగా విచారించలేమని, నాలుగు వారాల తర్వాత విచారమ చేపడతామని సుప్రీంకోర్టు (Supreme court)తెలిపింది.
