Chevella road accident: ఈ పాపం ఎవరిది ? చేవెళ్ల విషాదంతోనైనా కళ్లు తెరుస్తారా !
Chevella road accident: చేవెళ్ల దగ్గర ఇవాళ తెల్లవారుఝామున చోటు చేసుకున్న ఈ ఘోరప్రమాదంలో 20 మంది మృతి చెందారు.
Chevella road accident
మరో గంటన్నరలో గమ్యస్థానం చేరుకుంటామని హాయిగా పడుకున్న వారందరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. టిప్పర్ లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కాటేసింది. అది కూడా టిప్పర్ లారీలో ఉన్న కంకర మీద పడి ఊపిరాడక నరకయాతన అనుభవిస్తూ కన్నుమూశారు. చేవెళ్ల(Chevella) దగ్గర ఇవాళ తెల్లవారుఝామున చోటు చేసుకున్న ఈ ఘోరప్రమాదంలో 24 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటనేదే ఇప్పుడు హాట్ టాపిక్… రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కానీ ఈ ప్రమాదం జరగడానికి కారణాలను విశ్లేషిస్తే చాలానే కనిపిస్తున్నాయి. నేషనల్ హైవే -163 పై కంకర తేలిన రోడ్డు, గోతులు,గుంతలను నింపుకున్న రోడ్డు ఇది మొదటి కారణం…అయితే టిప్పర్‌లో పరిమితికి మించి కంకర నింపుకుని, మితిమీరిన వేగంతో వెళ్తూ బస్సును ఢీకొట్టిందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.ఓవర్ స్పీడ్‌తో వచ్చిన టిప్పర్ డ్రైవర్… ఈ భారీ గొయ్యిని తప్పించబోయి..బస్సును ఢీకొట్టాడని అంటున్నారు. టిప్పర్‌లో కేవలం 35 టన్నుల కంకర నింపుకునేందుకు మాత్రమే అనుమతి ఉందని, కానీ సదరు డ్రైవర్ దానికి రెట్టింపు లోడ్ తో వచ్చాడంటూ చెబుతున్నారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అధికారులు, ప్రభుత్వాల వాదన ఉందంటూ పలువురు మండిపడుతున్నారు. జాతీయ రహదారి 163పై గత కొన్నేళ్లుగా మృత్యు రహదారిగా మారిందని స్ధానికులు ఎప్పటికప్పుడూ అధికారులకు మొరపెట్టుకుంటూనే ఉన్నారు.వాణిజ్య, వ్యవసాయ, ప్రయాణ అవసరాలకు ఈ రహదారి చాలా కీలకం. రోడ్ వైడెనింగ్ జరగకపోవడం వల్లే నేటి ప్రమాదం జరిగిందనేది అర్థమవుతోంది. గత ఏడాది ఇదే సమయంలో ప్రమాదం జరిగినప్పుడు అక్కడి స్థానికులు రోడ్డు విస్తరణ కోసం నిరసన తెలిపినా ప్రభుత్వంలో కదలిక రాలేదని పలువురు విమర్శిస్తున్నారు. పేరుకే నేషనల్ హైవే కానీ ఇరుకైన రహదారి ఇది.
రెండు వైపులా వాణిజ్య కార్యకలాపాలు, కూరగాయల మార్కెట్లు ఉండటంతో వాహనాల రాకపోకలు కష్టతరంగా మారాయి. దీంతో రోడ్డు విస్తరణలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. 46 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గుంతలు, మలుపుల గురించి చెప్పాల్సిన పనే లేదు. స్పీడ్ బ్రేకర్లు బూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. ఓవర్ స్పీడ్ తో , ఇక్కడి రోడ్డుపై గుంతలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా స్పీడ్ బ్రేకర్ల ఊసే లేదు. టిప్పర్ డ్రైవర్ దే మొత్తం తప్పంటూ ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా.. ఈ విషాద ఘటనతోనైనా వారు మేల్కొనాల్సిన అవసరం అయితే ఉందన్న వాదన వినిపిస్తోంది.




One Comment