Rudra : ఇండియన్ ఆర్మీలోకి రుద్ర ఎంట్రీ..ఎవరీ రుద్ర?

Rudra : దేశ భద్రతను మరింత పక్కా చేసేందుకు ఇండియన్ ఆర్మీ కీలక మార్పులతో దూసుకుపోతోంది.

Rudra : భారత సైన్యం ఇప్పుడు మరింత బలంగా, మోడర్న్‌గా తయారవుతోంది. దేశ భద్రతను మరింత పక్కా చేసేందుకు ఇండియన్ ఆర్మీ కీలక మార్పులతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా, ‘రుద్ర’ అనే కొత్త పేరుతో ఒక ‘ఆల్-ఆర్మ్స్ బ్రిగేడ్'(All-Arms Brigade)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కార్గిల్ విజయ్ దివస్ రోజున ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చేసిన ఈ ప్రకటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. భారత సైన్యాన్ని కొత్త కాలానికి తగ్గట్టుగా మార్చేందుకే ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

Rudra

‘రుద్ర’ అనేది కేవలం ఒక పేరు కాదు, భారత సైన్యం భవిష్యత్తులో యుద్ధాలకు ఎలా సిద్ధమవుతోందో చెప్పే ఒక ముఖ్యమైన అడుగు. ఈ ‘ఆల్-ఆర్మ్స్ బ్రిగేడ్’ కింద రకరకాల ఆయుధ విభాగాలకు చెందిన సైనికులను ఒకే టీమ్‌గా తీసుకువస్తారు. అంటే, నడిచి వెళ్లే దళాలు (పదాతి దళం), వాహనాల్లో ఉండే సైనికులు (మెకనైజ్‌డ్ పదాతి దళం), ట్యాంకులు లాంటి యుద్ధ వాహనాలు వాడేవాళ్లు (సాయుధ యూనిట్లు), ఫిరంగులు వాడేవాళ్లు (ఫిరంగి దళం), ప్రత్యేక దళాలు, ఇంకా కొత్తగా వస్తున్న డ్రోన్లు వంటి వాటిని వాడే బృందాలను ఒకే చోట కలుపుతారు.

ఈ పద్ధతి వల్ల ఇప్పుడున్న కష్టాలను, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను రుద్రతో ఇంకా బాగా ఎదుర్కోవచ్చని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. ఒకే నాయకత్వం కింద అన్ని రకాల దళాలు కలిసి పనిచేయడం వల్ల టీమ్ వర్క్ పెరుగుతుంది, వెంటనే నిర్ణయాలు తీసుకోవచ్చు, ఇది యుద్ధంలో మనకు చాలా ప్లస్ అవుతుంది.

‘రుద్ర’ బ్రిగేడ్‌(Rudra Brigade)తో పాటు, సరిహద్దుల్లో శత్రువులను ఎదుర్కోవడానికి భారత సైన్యం మరో అద్భుతమైన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది – అదే ‘భైరవ్’ లైట్ కమాండో యూనిట్. ఈ భైరవ్ యూనిట్ మన సైన్యం బలాన్ని చాలా రెట్లు పెంచుతుందని ఆర్మీ చీఫ్ చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఉండే కఠినమైన వాతావరణం, ఎత్తుపల్లాలు లాంటివి దృష్టిలో ఉంచుకొని, ఈ యూనిట్‌ను మన దేశంలోనే తయారు చేసిన కొత్త మిస్సైల్ సిస్టమ్స్‌తో రెడీ చేస్తున్నారు.

సరిహద్దులో శత్రువులను ఆశ్చర్యపరిచేలా ఎప్పుడూ ఈ యూనిట్ సిద్ధంగా ఉంటుందని ద్వివేది తెలిపారు.అంతేకాకుండా, సరిహద్దు ప్రాంతాల్లో కొత్త రోడ్లు, ఇతర ముఖ్యమైన సౌకర్యాలను కూడా వేగంగా డెవలప్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

భారత సైన్యం టెక్నాలజీ విషయంలో కూడా భారీ అడుగులు వేస్తోంది. జనరల్ ద్వివేది మాట్లాడుతూ, “ఇప్పుడు ప్రతి పదాతిదళ బెటాలియన్‌లో ఒక ప్రత్యేక డ్రోన్ గ్రూప్ ఉంటుంది. అలాగే, ఫిరంగిదళంలో ‘శక్తిబన్ రెజిమెంట్’ను ఏర్పాటు చేశారు. ఇది డ్రోన్లు, వాటిని ఎదుర్కొనే డ్రోన్లు, ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించే బాంబులతో సిద్ధమై ఉంటుంది. ప్రతి రెజిమెంట్‌లోనూ ఈ కొత్త ఆయుధాలతో కూడిన ఒక ప్రత్యేక బ్యాటరీ ఉంటుంది” అని వివరించారు.

మన దేశంలోనే తయారు చేసిన మిస్సైల్ సిస్టమ్స్‌తో గాలిలో రక్షణ కల్పించే దళాలు సిద్ధమవుతున్నాయి కాబట్టి, రాబోయే రోజుల్లో భారత సైన్యం యొక్క సామర్థ్యం చాలా రెట్లు పెరుగుతుందని ఆర్మీ చీఫ్ బలంగా చెప్పారు. ఇది మన దేశ రక్షణ వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తుంది.

భారత సైన్యం (Indian Army)యొక్క కఠినమైన వైఖరిని స్పష్టం చేస్తూ, ఆపరేషన్ సిందూర్ గురించి జనరల్ ద్వివేది కీలక విషయాలు చెప్పారు. “ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా చేసిన సర్జికల్ స్ట్రైక్స్, టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చే వాళ్లను అస్సలు వదిలిపెట్టం అనే ఒక స్పష్టమైన మెసేజ్‌ని పాకిస్తాన్‌కు ఇచ్చాయని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఇది జవాబు అని, ఆ దాడి మొత్తం దేశానికి చాలా బాధను కలిగించిందని ఆయన గుర్తు చేశారు.

Exit mobile version