SIR
తెలంగాణలో ప్రజాస్వామ్య పునాదిని పటిష్టం చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక అడుగును వేస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణలో త్వరలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
నిజమైన ఓటర్ల జాబితానే ప్రజాస్వామ్యానికి అసలైన బలం అని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. 20 ఏళ్లుగా దేశవ్యాప్తంగా సరైన ఇంటింటి సర్వే జరగకపోవడం వల్ల ఓటర్ల జాబితాలో ఎన్నో నకిలీ ఓట్లు, మరణించిన వారి పేర్లు పేరుకుపోయాయని చెప్పారు. అందుకే వీటిని తొలగించి, జాబితాను శుద్ధి చేయడమే ఈ SIR ప్రధాన ఉద్దేశ్యమన్న ఆయన.. ఈ ప్రక్రియ వల్ల తెలంగాణలో సుమారు 50 లక్షల వరకు నకిలీ ఓట్లు తొలగిపోయే అవకాశముందని తమ అంచనా అని చెప్పారు.
అయితే SIR ఎందుకు అవసరం? దీనివల్ల లాభమెవరికి? అంటే గత ఎన్నికల్లో తెలంగాణలో సుమారు 5 నుంచి 7 శాతం వరకు ఓటర్ల జాబితాలో అసాధారణతలను అధికారులు గమనించారు. ఒకే చిరునామాలో 20 మందికి పైగా ఓటర్లు ఉండటం, మరణించిన వారి పేరు మీద ఓట్లు చెల్లుబాటులో ఉండటం వంటివి ఎన్నికల పారదర్శకతను దెబ్బతీస్తున్నాయని గుర్తించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ రాష్ట్రంలో క్లీన్ ఓటర్ లిస్ట్ ఉండటం తప్పనిసరి. ఈ SIR అమలు వల్ల నిజమైన ఓటర్లకు గుర్తింపు లభిస్తుంది. అలాగే రిగ్గింగ్ వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ఆంధ్రప్రదేశ్,బీహార్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం ద్వారా లక్షలాది నకిలీ ఓట్లను తొలగించి విజయం సాధించారు.
దీనికోసం మీరు సిద్ధం చేసుకోవాల్సిన 11 ముఖ్యమైన పత్రాలు గురించి ఒకసారి చూస్తే.. SIR సమయంలో బూత్ లెవల్ అధికారులు (BLO) మీ ఇంటికి వస్తారు. గణన దశలో వివరాలు మ్యాచ్ కాకపోతే, లేదా నోటీసు దశలో సందేహాలు ఉంటే మీరు ఈ క్రింది పత్రాలలో ఒకదానిని సమర్పించాల్సి ఉంటుంది.
1. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఐడీ కార్డు.
2. 1987 జూలై 1కి ముందు జారీ చేసిన బ్యాంక్ పాస్‌బుక్/ఎల్‌ఐసీ/బీమా పత్రం.
3. మున్సిపాలిటీ లేదా సమర్థ అధికారి జారీ చేసిన పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం.
4. భారత పాస్‌పోర్ట్.
5. 10వ తరగతి లేదా విద్యా ధృవీకరణ పత్రం.
6. నివాస ధృవీకరణ పత్రం (Domicile Certificate).
7. అటవీ హక్కుల ధృవీకరణ పత్రం.
8. కుల ధృవీకరణ పత్రం (OBC/SC/ST).
9. జాతీయ పౌరుల రిజిస్టర్ (NPR) పత్రం.
10. కుటుంబ రిజిస్టర్ కాపీ.
11. ప్రభుత్వం కేటాయించిన భూమి లేదా ఇంటి పట్టా.
అయితే SIR ప్రక్రియలో పుట్టిన తేదీని బట్టి పత్రాల సమర్పణ మారుతుంది.
1987 జూలై 1 కంటే ముందు జన్మించిన వారు పైన పేర్కొన్న జాబితాలో ఏదైనా ఒక పత్రం ఇస్తే సరిపోతుంది.
1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించిన వారు తమ పత్రంతో పాటు తండ్రి లేదా తల్లికి సంబంధించిన ఒక ఆధారాన్ని ఇవ్వాలి.
2004 డిసెంబర్ 2 తర్వాత జన్మించిన వారు తమ పత్రంతో పాటు తల్లిదండ్రులు ఇద్దరి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఒకవేళ పొరపాటున మీ పేరు జాబితా నుంచి తొలగించబడితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఫారమ్-6 (కొత్త పేరు చేరికకు) లేదా ఫారమ్-8 (సవరణల కోసం) ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ‘voters.eci.gov.in’ పోర్టల్ ద్వారా లేదా NVSP యాప్ ద్వారా సులభంగా అప్లై చేయొచ్చు. డ్రాఫ్ట్ లిస్ట్ విడుదలైన 7 రోజుల్లోపు ఈ క్లెయిమ్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. స్థానిక BLO నంబర్‌ను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు మీ ఓటర్ కార్డులోని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవడం మంచిది. ఈ SIR ప్రక్రియ ద్వారా తెలంగాణలో పారదర్శకమైన ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
World Cup : మనకు మరో వరల్డ్ కప్ లోడింగ్ భారత్‌కు ఎదురు లేనట్టేనా ?
