Ranya Rao
సినీ ప్రపంచంలో అందం, అభినయం చూసే ప్రేక్షకులకు, దాని వెనుక కొన్ని చీకటి కోణాలు కూడా ఉంటాయని ఈ కేసు మరోసారి గుర్తు చేసింది. కన్నడ నటి రన్యా రావు(Ranya Rao) అక్రమ బంగారపు రవాణా కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) షాక్ ఇచ్చింది. ఈ కేసులో DRI రన్యా రావుతో పాటు మరో ముగ్గురిపై కలిపి మొత్తం రూ. 270 కోట్ల భారీ జరిమానా విధించింది. ఇందులో రన్యా రావు ఒక్కరిపైనే రూ. 102.55 కోట్లు విధించారు. ఇది ఒక వ్యక్తిపై విధించిన అత్యధిక జరిమానాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు.
ఈ కేసు ఈ ఏడాది మార్చి 3న వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో 127.3 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నటి రన్యా రావు(Ranya Rao)ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ఉన్నారు. తరుణ్ కొండూరు రాజు, సాహిల్ జైన్, భరత్ జైన్. DRI విచారణలో, తరుణ్ కొండూరు రాజు 72.6 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినందుకు దోషిగా తేలగా, అతనికి రూ. 62 కోట్ల జరిమానా విధించారు. సాహిల్ జైన్ భరత్ జైన్ ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ. 53 కోట్ల చొప్పున జరిమానా పడింది.
DRI ఈ కేసులో 2500 పేజీలకు పైగా ఆర్థిక , లావాదేవీల పత్రాలతో కూడిన షో-కాజ్ నోటీసులను జారీ చేసింది. కస్టమ్స్ చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. ఒకవేళ నిందితులు ఈ జరిమానాలు చెల్లించకపోతే, వారి ఆస్తులను జప్తు చేసే అధికారం DRIకి ఉంది. త్వరలోనే ఈ కేసుపై ప్రాసిక్యూషన్ కూడా మొదలవుతుందని అధికారులు తెలిపారు. ఈ కేసు సంబంధిత విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం (COFEPOSA) పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. దీని తదుపరి విచారణ సెప్టెంబర్ 11కి వాయిదా పడింది.
ఈ కేసు ద్వారా సినీ ప్రముఖులు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనడం, వారి ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకత లేకపోవడం వంటి విషయాలు చర్చనీయాంశంగా మారాయి. DRI తీసుకున్న ఈ కఠినమైన చర్యలు, ముఖ్యంగా భారీ జరిమానాలు విధించడం, బంగారపు స్మగ్లింగ్‌పై భారతీయ ఏజెన్సీల నిఘా ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తుంది. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది, భవిష్యత్తులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రన్యా రావు(Ranya Rao)కు జైలులో షో-కాజ్ నోటీసులు అందజేయడం, ఆమె స్టేటస్‌పై విమర్శలు పెరగడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది