Assam tea
ప్రపంచంలోనే తేయాకు ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ ఘనతకు ప్రధాన కారణం అసోం రాష్ట్రమే అని చెప్పొచ్చు. ఎందుకంటే, దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం తేయాకు(Assam tea)లో ఏటా 60 కోట్ల కిలోలకు పైగా ఈ ప్రాంతం నుంచే వస్తోంది. సుమారు 22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వందల సంఖ్యలో టీ తోటలు అసోంలో పచ్చగా పరుచుకొని ఉన్నాయి. దేశంలో అత్యధిక తేయాకు పంటలు అసోంలోనే ఉండటానికి చారిత్రక కారణాలు ఉన్నాయి.
మొట్టమొదటగా టీ(Assam tea)ని క్రీస్తుపూర్వం 2,737లో చైనాలో కనుగొన్నారు. నాటి చక్రవర్తి షెన్ నాంగ్ ఒకరోజు తన తోటలో కూర్చొని ఉండగా, పనిమనిషి వేడి చేస్తున్న నీటిలో కొన్ని ఆకులు గాలిలో తేలియాడుతూ పడ్డాయట. ప్రయోగశీలి అయిన షెన్ ఆ నీటిని తాగగా, రుచి అద్భుతంగా అనిపించింది. అలా తొలిసారి తేయాకు రుచి మనిషికి తెలిసి, టీ తయారీ మొదలైంది.
1660వ దశకంలో మన దేశంలో తేయాకును ఔషధంగా మాత్రమే ఉపయోగించేవారు. అప్పట్లోనే అసోంలోని సింగ్‌పోస్ తెగ ప్రజలు తేయాకును పండిస్తున్నారు. అయితే, టీ చరిత్రలో కీలక మలుపు 1823లో సంభవించింది. వ్యాపారం నిమిత్తం భారత్‌కు వచ్చిన స్కాట్లాండ్ దేశస్థుడు రాబర్ట్ బ్రూస్, అసోంలోని రంగ్‌పుర్‌లో తేయాకు చెట్టు పెరుగుతుండటాన్ని గమనించారు.
ఆ తర్వాత, బ్రిటీష్ పాలకులు 1839లో అసోం టీ కంపెనీని స్థాపించి తేయాకును వాణిజ్యపరంగా పండించడం మొదలుపెట్టారు. వారి వద్ద పనిచేసిన మణిరామ్ దివాన్ అనే భారతీయుడు సొంతంగా టీ తోటలు స్థాపించి, టీ పౌడర్ విక్రయాన్ని ప్రారంభించారు. ఫలితంగా, 1862 నాటికి అసోం ప్రాంతంలో 160 తేయాకు తోటలు వెలిశాయి. ప్రస్తుతం అక్కడ 800కుపైగా తోటలు ఉన్నాయి.
సమయపాలన విషయంలో అసోం తేయాకు (Assam tea)తోటల్లో ఒక విచిత్రమైన నియమాన్ని పాటిస్తారు. ఈ ప్రాంతంలో పాటించే సమయాన్ని ‘టీ గార్డెన్ టైమ్’ అని పిలుస్తుంటారు. ఇది ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST) కన్నా ఒక గంట ముందుంటుంది. దేశ ప్రధాన భూభాగంతో పోలిస్తే ఈశాన్య ప్రాంతాల్లో సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు. దీనిని సద్వినియోగం చేసుకొని, ఉదయం పూట వచ్చే వెలుతురుతో తేయాకు ఉత్పత్తిని పెంచుకోవాలని అప్పటి బ్రిటీష్ పాలకులు యోచించారు.
అందుకే కూలీలను ఉదయం ఒక గంట ముందుగా పనులకు రావాలని సూచించారు. అంటే, తోటల్లో ప్రజలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనులు చేస్తారు. ఇప్పటికీ తేయాకు తోటల్లో ఈ సమయాన్నే పాటిస్తూ ఉత్పత్తిని పెంచుకుంటున్నారు.