MiG-21
భారత వైమానిక దళానికి ఆరు దశాబ్దాల పాటు వెన్నెముకగా నిలిచిన మిగ్-21(MiG-21) బైసన్ యుద్ధ విమానం ఇకపై ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుంది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించి, ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించిన ఈ విమానం, తన చివరి ప్రయాణాన్ని సెప్టెంబర్ 26న చండీగఢ్ ఎయిర్‌బేస్ నుంచి ప్రారంభించనుంది. ఇది కేవలం ఒక విమానం రిటైర్మెంట్ కాదు, భారత వైమానిక దళ చరిత్రలో ఒక శకం ముగింపు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్తో పాటు, ఈ విమానాన్ని నడిపిన అనేక మంది మాజీ పైలట్లు ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొంటారు.ఈ వీడ్కోలును ప్రత్యేకంగా జరుపుకోవడానికి, మిగ్-21 (MiG-21)విమానాన్ని దాని స్వర్ణయుగమైన 1960ల నాటి యుద్ధ విన్యాసాలను ప్రదర్శిస్తుంది. ఈ ప్రదర్శనలో, మిగ్-21 ఆకాశంలో గస్తీ తిరుగుతూ, గ్రౌండ్ కంట్రోల్ సందేశాల ఆధారంగా శత్రు విమానాలను అడ్డగించే దృశ్యాన్ని తిరిగి ఆవిష్కరిస్తుంది. ఈ ప్రత్యేక ఫ్లైపాస్ట్ సమయంలో, స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలు మిగ్-21కి తోడుగా ఎగురుతూ, భవిష్యత్తు వారసత్వాన్ని సూచిస్తాయి. చివరిగా, పైలట్ స్క్వాడ్రన్ తాళాలను రక్షణ మంత్రికి అప్పగిస్తారు.
మిగ్-21(MiG-21) బైసన్ రెండు స్క్వాడ్రన్‌లు (నంబర్ 3 ‘కోబ్రాస్’ , నంబర్ 23 ‘పాంథర్స్’) వైమానిక దళం నుంచి నిష్క్రమించడంతో, IAF స్క్వాడ్రన్‌ల సంఖ్య 29కి తగ్గుతుంది. ఇది ప్రస్తుత అవసరాల కంటే తక్కువ అయినా కూడా, ఈ అంతరాన్ని పూడ్చడానికి LCA తేజస్ మార్క్-1A విమానాలు సిద్ధంగా ఉన్నాయి. మొదటి తేజస్ విమానం నంబర్ 3 స్క్వాడ్రన్‌లోనే చేరడం ఒక శుభ సూచకం. ఈ పరిణామం భారతదేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి (ఆత్మనిర్భరత) దిశగా అడుగులు వేస్తున్నదని నిరూపిస్తోంది.
మిగ్-21: కొన్ని చేదు జ్ఞాపకాలు, ఎన్నో విజయాలు..1971 ఇండో-పాక్ యుద్ధంతో పాటు అనేక ముఖ్యమైన ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించినా కూడా.. దీని ప్రమాదాల కారణంగా ఈ విమానానికి ‘ఫ్లయింగ్ కాఫిన్’ అనే పేరు కూడా ఉంది. అయినా సరే, ఇది ఎంతోమంది పైలట్లకు శిక్షణ ఇచ్చి, దేశ రక్షణకు కీలక సేవలందించింది.