Bhavana Chaudhary
భారతదేశపు పారామిలిటరీ వైమానిక రంగంలో ఇన్‌స్పెక్టర్ భావనా చౌదరి(Bhavana Chaudhary) సరికొత్త చరిత్రను నమోదు చేశారు. ఆమె బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఎయిర్ వింగ్‌లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీర్‌గా మైలురాయిని సాధించారు.
1969లో స్థాపించబడిన BSF ఎయిర్ వింగ్‌కు సుమారు 50 సంవత్సరాల చరిత్రలో ఈ గౌరవం దక్కిన తొలి మహిళ భావనా చౌదరి. ఇది మహిళా సాధికారతకు మరియు దేశ అంతర్గత భద్రతా రంగంలో ఒక విశేష పునాదిని నెలకొల్పింది.
భావనా చౌదరి(Bhavana Chaudhary) BSFలో ఫ్లైట్ ఇంజినీర్ బాధ్యతను సాధించిన దేశంలోనే మొట్టమొదటి మహిళగా నిలిచారు. ఈ పదవి ఇంతవరకు కేవలం పురుషులకే పరిమితమై ఉండేది. ఆమె ఈ మైలురాయిని చేరుకోవడానికి 2025 ఆగస్ట్‌లో మొదలైన రెండు నెలల పాటు జరిగిన BSF ఇంటర్నల్ ట్రైనింగ్‌లో పాల్గొన్నారు.
ఈ శిక్షణలో ఫ్లైట్ ఇంజినీరింగ్‌తో పాటు, అత్యవసర పరిస్థితుల్లో సమర్థంగా వ్యవహరించే సాంకేతిక, ఆపరేషన్ జ్ఞానం, మిషన్ సర్టిఫికేషన్‌లతో కూడిన అనేక రియల్ టాస్క్‌లపై 130 గంటల అనుభవాన్ని పొందారు. ఈ శిక్షణ పూర్తవడంతో, ఆమె Mi-17 హెలికాప్టర్లు, ఎంబ్రేర్ జెట్ వంటి ముఖ్య విమానాలకు సేవలు అందించే జట్టులో సభ్యురాలిగా మారారు.
ఈ ఘనతను పురస్కరించుకుని, న్యూఢిల్లీలో జరిగిన వెలిడిక్టరీ సెర్మనీలో, డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి చేతుల మీదుగా ఆమెతో పాటు మరో నలుగురు పురుషులు అధికారికంగా “ఫ్లయింగ్ బ్యాడ్జెస్” అందుకున్నారు.
గతంలో, ఫ్లైట్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ కేవలం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) ద్వారా మాత్రమే లభించేది. అయితే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) అనుమతితో, BSF మొట్టమొదటిసారిగా ఇంటర్నల్ ఇన్-హౌస్ ఫ్లైట్ ఇంజినీర్ (FLT) శిక్షణను నిర్వహించి, మహిళలకు ఈ అవకాశాన్ని కల్పించింది.
BSF ఎయిర్ వింగ్ వివిధ పారామిలిటరీ దళాలకు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) వంటి ప్రత్యేక యూనిట్లకు కీలకమైన విమాన సేవలను అందిస్తుంది – వీటిలో రెస్క్యూ మిషన్లు, విపత్తు సహాయం , VIP డ్యూటీలు భాగంగా ఉంటాయి.
ఈ కీలక పాత్రలో ఒక మహిళ భాగస్వామ్యం కావడం దాదాపుగా కొత్త చరిత్రే. ఇన్‌స్పెక్టర్ భావనా చౌదరి(Bhavana Chaudhary) ఈ అడ్డంకులను చెరిపివేయడం ద్వారా, భారత దేశ పారామిలిటరీ ఏవియేషన్ రంగంలో మహిళలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ఒక ముఖ్యమైన ద్వారం తెరిచారు, దీని ద్వారా రాబోయే తరాలకు గొప్ప ప్రేరణగా నిలిచారు.
Bigg Boss: బిగ్ బాస్ హౌజ్‌లో వైల్డ్ కార్డ్ రచ్చ.. కళ్యాణ్‌ను ‘అమ్మాయి పిచ్చోడు’ అన్న రమ్య