Golden Temple
ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం(Golden Temple)… ఇక్కడ మెరిసే బంగారం గోపురం(Golden Temple), లేదా అద్భుతమైన వాస్తుశిల్పం కంటే గొప్ప ఆశ్చర్యం మరొకటి ఉంది. అదే, ఇక్కడ నిరంతరాయంగా, ఎలాంటి బేధభావం లేకుండా, కోట్లాది మంది ఆకలి తీర్చే ‘లంగర్’ (Langar) వ్యవస్థ. ఇది కేవలం వంటశాల కాదు, మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం.
రోజుకు లక్ష మందికి పైగా భక్తులు, యాత్రికులు ఇక్కడ ఉచితంగా ఆహారం స్వీకరిస్తారు. 24 గంటలూ, 365 రోజులూ ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఈ భారీ వ్యవస్థను నిర్వహించడానికి ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు, లేదా ప్రభుత్వ నిధులు ఉండవు. కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకం, మరియు నిస్వార్థ సేవ (Sewa) మాత్రమే దీనికి ఇంధనం.
లంగర్ వెనుక ఉన్న రెండు కీలక సూత్రాలు..
సేవ (Sewa).. ఈ లంగర్‌లో వంట చేయడం నుంచి, పాత్రలు కడగడం, కూరగాయలు తరగడం వరకు… ప్రతి పనినీ స్వచ్ఛంద సేవకులు మాత్రమే చేస్తారు. ఎవరూ జీతం తీసుకోరు. నిమిషానికి వేల కొద్దీ చపాతీలు చేసే యంత్రాలు ఉన్నా కూడా, కూరగాయలు తరగడానికి, లేదా భారీ పాత్రలు శుభ్రం చేయడానికి వందలాది మంది భక్తులు గంటల తరబడి నిలబడి సేవ చేస్తారు. ఇది ఆ భగవంతుడికి తమ కృతజ్ఞతను తెలుపుకునే మార్గంగా సిక్కులు భావిస్తారు.
పంగత్ (Pangat).. లంగర్‌లో ఆహారం స్వీకరించే ముందు, అక్కడ పాటించే అత్యంత ముఖ్యమైన నియమం ‘పంగత్’. పంగత్ అంటే బారులు తీరి కూర్చోవడం. ధనవంతుడు, పేదవాడు, రాజు, సేవకుడు, కులం, మతం, లింగ భేదం లేకుండా అందరూ నేలపై ఒకే వరుసలో కూర్చొని భోజనం చేస్తారు. ఇది సమానత్వం (Equality) యొక్క అత్యున్నత ప్రకటన. ఆకలి ముందు, అందరూ సమానమే అనే ఈ సిద్ధాంతాన్ని గురువులు స్థాపించారు.
లంగర్ నిర్వహణ అద్భుతం. ప్రతి రోజు వేల కిలోల పిండి, బియ్యం, పప్పులు, కూరగాయలు వండుతారు. ఇదంతా కేవలం భక్తులు అందించే విరాళాల ద్వారానే సాధ్యమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ‘కమ్యూనిటీ కిచెన్’గా గుర్తింపు పొందిన ఈ వ్యవస్థ… దయ, నిస్వార్థం, మానవ సమభావం అనే మూడు మూల స్తంభాలపై నిలబడి, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆశ్రయాన్ని ఇస్తూ, నిజమైన ఆధ్యాత్మికతను లోకానికి చాటి చెబుతోంది.
