The Taj Story
ఎల్లలు లేని ప్రేమకు అందమైన చిహ్నం ఏదంటే అందరూ చెప్పే పేరు తాజ్ మహల్…మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ పాలరాతి కట్టడం ఓ అద్భుతం.. అందుకే ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా నిలిచిపోయింది. 1632లో మొదలైన దీని నిర్మాణం రెండు దశాబ్దాల పాటు సాగింది. ఏకంగా 22 వేల మందికి పైగా కార్మికులు, ఎంతోమంది శిల్పకళాకారుల శ్రమతో 1653లో తాజ్ మహల్ పూర్తయింది.
చాలా మందికి షాజహాన్ తన ప్రేమకు చిహ్నంగా కట్టించిన రూపంగానే దీనిని చూస్తారు. అయితే తాజ్ మహల్ వెనుక కొన్ని చీకటి కోణాలుగా పేర్కొంటూ కథలు కూడా వినిపిస్తుంటాయి. ఈ కథలన్నింటినీ స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు తాజ్ మహల్ పై సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు పరేశ్ రావల్ ప్రధాన పాత్రలో ది తాజ్ స్టోరీ (The Taj Story)పేరుతో రూపొందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజైంది. ఈ టీజర్ తో ఇప్పుడు తాజ్ మహల్ తెరవెనుక స్టోరీలంటూ వివాదం మళ్ళీ మొదలైంది.
నిజానికి చాలా కాలం నుంచే తాజ్ మహల్ పై పలు కథలు వినిపించాయి. శివాలయం కూల్చేసి ఈ మహల్ కట్టారన్నవాదన అప్పట్లో తెరపైకి వచ్చింది. తేజో మహాలయ అనే పాత హిందూ కట్టడంపై దీనిని నిర్మించారంటూ పలువురు హిందుత్వ వాదులు పోరాడుతున్నారు. ఇదే వాదనను చరిత్రకారుడు పురుషోత్తం నగేష్ ఓక్ తన పుస్తకంలో రాయడం మరింత చర్చకు దారితీసింది.
అయితే ఈ వాదనలను , ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. ఈ వివాదాస్పద అంశాల ఆధారంగానే ది తాజ్ స్టోరీ(The Taj Story) తెరకెక్కడంతో మరోసారి చర్చ జరుగుతోంది. వివాదాస్పద అంశాలున్న కథలకు సహజంగానే మంచి క్రేజ్ ఉంటుంది. గతంలో వచ్చిన కేరళ స్టోరీ, కశ్మీరి ఫైల్స్ వంటి సినిమాలే వీటికి ఉదాహరణ. చరిత్రలో మరుగున పడ్డ కథలను తెరకెక్కించే క్రమంలోనే ది తాజ్ స్టోరీ కూడా వస్తోంది.
తాజ్ మహల్ గురించి మీకేం తెలుసు అనే ప్రశ్నతో టీజర్ మొదలై మరింత ఆసక్తిని రేకెత్తించింది. పరేశ్ రావల్ లాంటి యాక్టర్ నటిస్తుండడంతో మరింత హైప్ వచ్చింది. తాజ్ స్టోరీ(The Taj Story) అసలు కథ తెలియాలంటే అక్టోబర్ 31వరకూ వేచిచూడాల్సిందే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆ రోజే ఈ మూవీ విడుదల కాబోతోంది. మూవీ విడుదలకు ముందే పలు వర్గాలు దీనిపై విమర్శలు చేస్తున్నప్పటకీ… ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో నిర్మాతలున్నారు. మరి విడుదలైన తర్వాత ది తాజ్ స్టోరీ ఎలాంటి వివాదాలకు తెరతీస్తుందో చూడాలి.