Bihar: బిహార్ లో డబుల్ సెంచరీ..  ఎన్డీఏ ఘనవిజయానికి కారణాలివే

Bihar: గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు నితీశ్ ప్రభుత్వానికే జైకొట్టారు. అటు మహిళా ఓటర్లు నితీశ్ ప్రభుత్వంపై రెట్టింపు నమ్మకంతో ఉండడం కూడా ఈ భారీ విజయానికి కారణమైంది.

Bihar

ప్రభుత్వ పాలనలో కొన్ని అంశాలపై దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా విజయం వెనకాలే వస్తుందని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన బిహార్ (Bihar)అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించింది. అది కూడా సీట్లలో డబుల్ సెంచరీ కొట్టింది. నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి మహాఘట్ బంధన్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రతిపక్షాలకు మేలు కలుగుతుంది.

కానీ బిహార్(Bihar)లో ప్రభుత్వ వ్యతిరేకత కొన్ని అంశాలకై పరిమితమైంది. పైగా ప్రజలకు మేలు కలిగించిన అంశాల్లో ప్రభుత్వంపై సానుకూలతే ఉండడంతో నితీశ్ ప్రభుత్వానికి ఎదురే లేకుండా పోయింది. ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకూ ఎన్టీఏ వైపే విజయాన్ని ఊహించాయి.

Bihar

అయితే బిహార్ (Bihar)లో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ తారుమారవుతూ ఉంటాయి. ఈ సారి మాత్రం ఎగ్టిట్ పోల్స్ అంచనాలు తప్పలేదు. అదే సమయంలో పోలింగ్ శాతం పెరగడం కూడా నితీశ్ సర్కారును కాస్త టెన్షన్ పెట్టింది. ఎందుకంటే బిహార్ లో పోలింగ్ పర్సెంటేజీ పెరిగిన ప్రతీసారీ ప్రభుత్వం మారుతూ వచ్చింది. అయితే ఈ సారి దానికి భిన్నంగా నితీశ్ ప్రభుత్వం మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది.

ఎన్డీఏ కూటమి విజయానికి పలు కీలక అంశాలను కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా నితీశ్ కుమార్ పాలనలో రహదారుల అభివృద్ధి, చట్ట వ్యవస్థ మెరుగవడం, గ్రామాల విద్యుద్దీకరణ, అమ్మాయిల చదువుకు ప్రోత్సాహం, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసిన పథకాలు బాగా కలిసొచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు నితీశ్ ప్రభుత్వానికే జైకొట్టారు. అటు మహిళా ఓటర్లు నితీశ్ ప్రభుత్వంపై రెట్టింపు నమ్మకంతో ఉండడం కూడా ఈ భారీ విజయానికి కారణమైంది.

Bihar

అలాగే ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ఇమేజ్ కూడా ఎన్డీఏ కూటమి విజయంలో కీలకంగా చెబుతున్నారు. కేంద్రంతో ముడిపడి ఉన్న పలు పథకాల అమలులో నితీష్ ప్రభుత్వం పనితీరుకు 100 శాతం మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే ఉచిత రేషన్, నగదు బదిలీలు, సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు, మహిళలు, కూలీలు, వలస కార్మికులకు బాగా లబ్ది చేకూర్చాయి.

మరోవైపు ప్రతిపక్ష మహాఘట్‌బంధన్‌లో పార్టీలు కలిసికట్టుగా పనిచేసినట్టు కనిపించలేదు. సీట్ల సర్దుబాటు నుంచి ప్రచారం వరకూ పలు అంశాల్లో అంతర్గత విభేదాలు, గందరగోళ పరిస్థితులు వారి అవకాశాలను దెబ్బతీయడమే కాకుండా ఎన్టీఏకు కలిసొచ్చాయి. ఎన్టీఏ కూటమిలో సీట్ల సర్దుబాటుతో పాటు ఇతర విషయాల్లోనూ వ్యూహత్మకంగా వ్యవహరించాయి. చిన్న చిన్న విభేదాలున్నా ఎక్కువ బయటకు రాకుండా సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేశాయి.

అలాగే బూత్ స్థాయిలో పోల్ మేనేజ్ మెంట్ విషయానికి సంబంధించి ఎన్డీఏ కూటమి వందకు వంద శాతం విజయవంతమైంది. కూటమిలో కీలక నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదరడం బాగా కలిసొచ్చింది. అన్నింటి కంటే ముఖ్యంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన జన్ సురాజ్ పార్టీతో బరిలోకి దిగినా ప్రభావం చూపలేకపోయారు. ఆయన పోటీ ఒకవిధంగా ఎన్టీఏకే కలిసివచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా పీకే పార్టీ చీల్చలేకపోయింది.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version