Tejashwi Yadav
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీల హామీలకు హద్దే ఉండదు. అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతోనే ఇష్టానుసారం హామీలు గుప్పిస్తుంటారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. హామీల సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు ఇచ్చే హామీలను చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యపోక మానదు. తాజాగా బిహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రచారహోరు తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్నాయి.
అయితే బిహార్ ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతీ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన కేవలం 20 రోజుల్లోనే అమలు చేస్తామంటూ చెప్పారు. దీని కోసం ఆర్టినెన్స్ కూడా తీసుకొస్తామంటూ తేజస్వి యాదవ్ ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ గెలిచి అధికారంలోకి వస్తే 20 రోజుల్లోపు ఉపాధికి హామీ ఇచ్చే కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 20 నెలల్లోపు ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. 20 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం లేని ఇల్లు లేకుండా చేస్తామన్నారు.
అయితే తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని ప్రత్యర్థి పార్టీలు చెబుతుంటే…తేజస్వీ యాదవ్ ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాను డేటాను బాగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ హామీ ఇచ్చానని చెప్పారు. ఇది జుమ్లా వాగ్దానం కాదని , తాము ఖఛ్చితంగా అమలు చేసి తీరతామన్నారు. బిహార్ ప్రజలకు సామాజిక న్యాయంతో పాటు, ఆర్థిక స్వావలంబన కూడా అందేలా చూస్తామనన్నారు.
దృఢ సంకల్పం ఉంటే ఈ హామీ అమలు చేయడం కష్టం కాదన్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)హామీని అమలు చేయడం కష్టమేనంటున్నారు. బిహార్ ఆర్థిక పరిస్థితి, ఇతర కోణాల్లో ఆలోచించి చూస్తే ఆచరణసాధ్యం కాదంటున్నారు. ఇదిలా ఉంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6న తొలి దశ, నవంబర్ 11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా… నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి.