Just InternationalJust TechnologyLatest News

Nobel Prize: రసాయన శాస్త్రంలో నోబెల్-2025.. పురస్కారం అందుకోనున్న ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు

Nobel Prize :ప్రొఫెసర్‌లు సుసుము కిటగావా (Susumu Kitagawa), రిచర్డ్ రాబ్సన్ (Richard Robson), ఒమర్ ఎం యాఘీ (Omar M. Yaghi) సంయుక్తంగా నోబుల్ బహుమతిని దక్కించుకున్నారు.

Nobel Prize

రసాయన శాస్త్ర ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి-2025(Nobel Prize) ఈసారి ముగ్గురు విశిష్ట శాస్త్రవేత్తలకు లభించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించినట్లుగా, ప్రొఫెసర్‌లు సుసుము కిటగావా (Susumu Kitagawa), రిచర్డ్ రాబ్సన్ (Richard Robson), ఒమర్ ఎం యాఘీ (Omar M. Yaghi) సంయుక్తంగా ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. వారు చేసిన ‘మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (MOFs) అభివృద్ధి’ కృషికి గానూ ఈ పురస్కారం లభించింది. నోబెల్ బహుమతితో పాటు, ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు సుమారు 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్‌ల (భారత కరెన్సీలో దాదాపు రూ.10 కోట్లు) నగదును కూడా పంచుకోనున్నారు.

ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధన యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, వారు అభివృద్ధి చేసిన మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (MOFs) అనే నిర్మాణాలు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. నోబెల్ కమిటీ ఫర్ కెమిస్ట్రీ అధ్యక్షుడు హైనర్ లింకే తెలిపిన దాని ప్రకారం, ఈ నిర్మాణాలు భవిష్యత్తులో అనేక రకాల సమస్యలకు పరిష్కారంగా మారనున్నాయి.

ఉదాహరణకు, ఈ MOFsను ఉపయోగించి..ఎడారి గాలిలోంచి నీటిని సేకరించడం.వాతావరణంలో అధికంగా ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ను పట్టుకోవడం (కార్బన్ క్యాప్చర్). విషపూరితమైన గ్యాసులను సురక్షితంగా నిల్వ చేయడం. రసాయన ప్రతిక్రియలను (Chemical Reactions) ప్రేరేపించడం (catalyze) వంటి పనులు చేయవచ్చు.

ఈ ముగ్గురు శాస్త్రవేత్తలలో, జపాన్‌కు చెందిన 79 ఏళ్ల సుసుము కిటగావా క్యోటో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రిచర్డ్ రాబ్సన్ యూకేలో జన్మించి, ప్రస్తుతం మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. జోర్డాన్‌లో జన్మించిన ఒమర్ ఎం యాఘీ యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియా-బర్క్లీ విశ్వవిద్యాలయంలో తమ సేవలను అందిస్తున్నారు.

కాగా, గత సంవత్సరం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి(Nobel Prize) కృత్రిమ మేధస్సు (AI) ద్వారా ప్రోటీన్ల నిర్మాణ కోడ్‌ను విప్పినందుకుగానూ డేవిడ్ బేకర్, జాన్ జంపర్, బ్రిటన్ డెమిస్ హస్సాబిస్‌కు లభించింది. ఇతర నోబెల్ బహుమతుల విషయానికొస్తే, సాహిత్య బహుమతి ప్రకటన రేపు జరగనుండగా, అత్యంత ముఖ్యమైన నోబెల్ శాంతి(Nobel Prize) బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడనుంది. ఈ ఏడాది నోబెల్ పురస్కారాలను డిసెంబర్ 10వ తేదీన విజేతలకు ప్రదానం చేయనున్నారు.

Trump: జనరిక్ ఔషధాలపై ట్రంప్ యు-టర్న్.. భారత ఫార్మాకు ఉపశమనం!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button